కాంగ్రెస్ నేతల్లోనూ అయోమయం….
దిశ దశ, పెద్దపల్లి:
లోకసభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ ఝలక్ ఎదురైంది. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. పెద్దపల్లి లోకసభ బీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్న వెంకటేష్ నేత అనూహ్య నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కొద్దిసేపటి క్రితం న్యూ ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో వెంకటేష్ నేత పార్టీ ఫిరాయించేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. న్యూ ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తోంది.
పూర్వాశ్రమంలోకే…
ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తించిన వెంకటేష్ నేత 2018 ఎన్నిలకు ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. బాల్క సుమన్ చేతిలో ఓడిపోయిన ఆయన 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో గులాభి గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వివేక్ కు టికెట్ రాకూడదని ఆయన వ్యతిరేక వర్గం అంతా జట్టుకట్టింది. ఈ క్రమంలో వెంకటేష్ నేతకు గులాభి కండువా కప్పి పెద్దపల్లి అభ్యర్థిగా బరిలో నిలపగా ఆయన లోకసభలోకి అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ఓ ప్రచార సభలో అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ ను ఎత్తుకుని మరీ ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వాహనంలోనే ఏఐసీసీ కేసీ వేణుగోపాల్ వద్దకు చేరుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు వెంకటేష్ నేత. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉండడం గమనార్హం.
అంచనాలు తలకిందులు…
మరో వైపున కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల అంచనాలు కూడా తలకిందులు అయినట్టుగా కనిపిస్తోంది. పెద్దపల్లి టికెట్ కోసం రోజు రోజుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను జాయిన్ చేసుకోవడం సంచలనంగా మారింది. గ్రౌండ్ లెవల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తమకు అనుకూలమైన వారికి టికెట్ ఇప్పించాలన్న యోచనలో ఉండగా వారి అంచనాలకు అందని విధంగడా వెంకటేష్ నేతను చేర్చుకోవడం సంచలనంగా మారింది.
అంతా ఒకే చోట…
ప్రస్తుతం పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో వైవిద్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి ఒకప్పుడు ఎంపీలుగా పోటీ చేసిన వారిలో ఎక్కువమంది ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. యాక్టింగ్ లో ఉన్న లీడర్లలో వివేక్ వెంకట స్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉండగా, 2019 ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా ఉన్న గోమాస శ్రీనివాస్ కూడా పెద్దపల్లి టికెట్ రేసులో ఉన్నారు. అంతకు ముందు ఇక్కడి నుండి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిన సుగుణ కుమారి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా తాజాగా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.