దిశ దశ, హుజురాబాద్:
ఎన్నికల ప్రచారంలో ఊపందుకున్నా కొద్ది రాజకీయ నాయకులు ఉత్సాహం చూపుతున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు దూకుడు కూడా ఎక్కువ కావడంతో ఒకరిద్దరు చూపిస్తున్న అత్యుత్సాహం విమర్శలకు దారి తీసేవిధంగా ఉంది. ఓ వైపున ఎన్నికల కమిషన్ షాడో టీమ్స్ ను ఏర్పాటు చేసి నేతల ప్రచారం తీరును వీడియో రికార్డ్ చేస్తున్నా తమకేమీ కాదన్న ధీమాతో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారు. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గంలో బుధవారం జరిగిన ప్రచారంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రచారం చేస్తూ ఓటర్లతో బాహాటంగా ప్రమాణాలు చేయించిన తీరు విస్మయం కల్గిస్తోంది. ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేస్తున్న పెద్దిరెడ్డి ప్రచారానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి గ్రామ దేవతల పేర్లు చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట తీసుకున్న తీరు అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తోంది. రహస్యంగ ఓటింగ్ విధానం ద్వారా ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ సారి ఎన్నికల ప్రచారంలో బాహాటంగానే ప్రమాణాలు చేయించుకుంటున్న తీరు సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ అభ్యర్థికి ఓటు వేయాలన కోరాలి కానీ ఏకంగా ఓటర్లచే ప్రమాణాలు చేయించే సంస్కృతి సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయన్న విషయాన్ని పట్టించుకోకుండా నాయకులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడడం గమనార్హం.