కరీంనగర్ కళాకారులు అద్భుత ప్రదర్శన
అరుణాచల వాసుడి సన్నిధిలో కరీంనగర్ కళాకారులు నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. అరుణాచల గిరి ప్రదర్శనకు వెల్లిన భక్తుల్లో తమ నాట్యంతో నూతనోత్సహాన్ని నింపారు. కరీంనగర్ ఆర్టిస్ట్ డాక్టర్ శ్వేత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అరుణాచలం వెల్లిన నృత్య కళాకారులు శనివారం రాత్రి అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అరుణాచలం శివయ్య సన్నిధిలో కరీంనగర్ చిన్నారుల నాట్యం నటరాజును కూడా అలరించాయా అన్న రీతిలో కొనసాగింది. వీరు అరుణాచల క్షేత్రంతో పాటు తిరుపతి, చిదంబరం ఆలయాల్లో కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. నాట్యం నేర్చుకోవడానికే పరిమితం కాకుండా ఏటా పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఆయా చోట్ల ప్రదర్శనలు ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతోందని నిర్వహాకులు తెలిపారు. ఈ సారి కళాకారుల తల్లిదండ్రులను కూడా టూర్ కు తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. ఆయా క్షేత్రాలలో నాట్య ప్రదర్శన చేసిన వారిలో ప్రవీణ, అంజనశ్రీ, హన్సిక, ప్రహర్షిక, అన్వితలతో పాటు మొత్త 15 మంది పాల్గొన్నారు. కరీంనగర్ చిన్నారుల నృత్యాలను వీక్షించిన ప్రేక్షకులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే ఆలయ ట్రస్టీలు, వేద పండితులు చిన్నారులను సన్మానించి ప్రోత్సహించారు.