ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ శాశ్వతంగా రద్దు

తెలంగాణలో ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25శాతం వెయిటేజీని విద్యా శాఖ శాశ్వతంగా తొలగించనుంది. ఈ మేరకు త్వరలోనే జీవో వెలువడనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎంసెట్‌ వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును నిర్ణయించడం జరిగింది. ఎంసెట్‌ పరీక్షలో సబ్జెక్టులైన మ్యాథ్స్, ఆ తర్వాత ఫిజిక్స్, చివరగా కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. గత కొన్నేళ్లుగా మార్కులు కాకుండా పర్సంటైజ్‌ను లెక్కిస్తున్నారు. పర్సంటైజ్ కూడా ఒకటే వస్తే పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకొని ఎవరు పెద్దవారైతే వారికి మెరుగైన ర్యాంకును కేటాయిస్తారు.

కరోనా కారణంగా 2020, 2021, 2022 ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ తొలగించారు. ఈ ఏడాదితో కూడా కలిపి వరుసగా నాలుగేళ్లుగా ఇంటర్‌ వెయిటేజీ లేకుండానే ఎంసెట్‌ ప్రవేశాలు కల్పిస్తున్నారు. దీంతో ఎంసెట్‌-2023 నుంచి ఇంటర్‌ మార్కులను వెయిటేజీ శాశ్వతంగా రద్దు చేయనున్నారు. ఇంటర్‌ విద్యార్ధులు 900లకు పైగా మార్కులు పొందుతున్నారు. అదే ఎంసెట్‌లో కనీస మార్కులు కూడా పొందలేకపోతున్నారు. సబ్జెక్ట్ పరిజ్ఞానం లేనివారిని ఫిల్టర్ చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలకు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించారు.

You cannot copy content of this page