దిశ దశ, కరీంనగర్:
మానేరు ఇసుక రీచుల వ్యవహారంపై పిటిషనర్లు రోజుకో ఎత్తుతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ నేషనల్ గ్రీన్ ట్యిబ్యూనల్ ను ఆశ్రయించడంతో పాటు సుప్రీంకోర్టు తలుపు తట్టి మరీ మానేరులో మైనింగ్ కార్యాకలాపాలకు తాత్కిలక బ్రేకులు వేయించారు మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు. మొదట ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారన్న అభియోగంపై పలువురికి పిటిషనర్లు లీగల్ నోటీసులు పంపించారు. ఎన్జీటీ సూచనల మేరకు ప్రతివాదులకు ఈ ధిక్కార నోటీసులు పంపిస్తున్నామని అడ్వకేట్ ప్రతిక్ రెడ్డి పేర్కొన్నారు. తన క్లయింట్లు గడీల రఘుమీర్ రెడ్డి, ఏ కర్ణాకర్ రెడ్డిలు ఓఎ నెంబర్ 51 /2023 దాఖలు చేసి కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇసుక రీచుల్లో డి సిల్ట్రేషన్ పేరిట తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ ఎన్జీటీకి వినతి చేశామన్నారు. దీంతో ఎన్జీటీ ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ఉన్నట్టయితే మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించవచ్చని, లేనట్టయితే నిలిపివేయాలని ఆదేశించిందన్నారు. 274/sand/tsmdc/2022 ద్వారా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసిడింగ్స్ పై స్టే ఉందని, ఈ మేరకు ప్రైవేటుగా నోటీసులు జారీ చేయాలని ఎన్జీటీ తమను ఆదేశిచిందని వివరించారు. టీఎస్ఎండీసీ హైకోర్టులో డబ్లూపి నెంబర్ 13459/2023 పిటిషన్ దాఖలు చేసి మైనింగ్ చేసుకునేందుకు అనుమతి పొందిందని, అయితే ఈ ఆదేశాలపై సుప్రీం కోర్టును తాము ఆశ్రయించామని తెలిపారు. దీంతో ఇంప్యుగ్డ్ ఆదేశాలిచ్చిన దేశ సర్వోన్నత న్యాయ స్థానం మళ్లీ విచారణ తేది వరకు మానేరు నదిలో ఎలాంటి కార్యకలాపాలు జరపకూడదని ఆదేశించినట్టు వివరించారు. అయితే పర్యావరణ అనుమతులు లేవని స్పష్టం అయినందున కోర్టు ఆదేశాలను అనుసరించి ఇసుక తవ్వకాలు జరపకూడదని తెలియజేస్తున్నామని, ధిక్కరణ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఎన్జీటీని ఆశ్రయిస్తామని అందులో వెల్లడించారు. ఎన్జీటీ చట్టం 2010 సెక్షన్ 26 ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష, లేదా జరిమానా రూ. 10 కోట్ల వరకు విధించే అవకాశం ఉందని, ఏక కాలంలో రెండు విధాల శిక్ష కూడా విధించే అవకాశం ఉందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా సుప్రీం కోర్ట్ ఆదేశాలను కూడా ఉల్లంఘించినందుకు ధిక్కార కేసు కూడా వేయాలని తన క్లయింట్లు భావిస్తున్నారని అడ్వకేట్ ప్రతిక్ రెడ్డి వివరించారు. ఈ నోటీసులు కేంద్ర పర్యావరణ, వాతావరణ శాఖతో పాటు రాష్ట్రంలోని వివిధ విభాగాలకు, రీచుల కాంట్రాక్టర్లకు కూడా పంపించారు.
వడ్డించే వారు మనవారైతే…
అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మానేరు పరివాహక ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలకు బ్రేకులు వేయాలని స్థానికంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో అధికారులు చెప్తున్న సమాధానాలు అత్యంత విచిత్రంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమకు ఇంకా సుప్రీం కోర్టు ఆదేశాలు రాలేదని కొంతమంది చెప్తుంటే, మరి కొంత మంది నదిలో మైనింగ్ కార్యకలాపాలు చేయవద్దని ఉత్తర్వులు ఉన్నాయి కానీ ఇసుక రవాణా చేయోద్దని చెప్పలేదు కదా అన్న ఎదురు ప్రశ్నలు మొదలయ్యాయి. వడ్డించే వాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా ఢోకా ఉండదు అన్నట్టుగా తయారైంది కొంతమంది అధికారుల చేస్తున్న వ్యాఖ్యలని మానేరు పరివాహక ప్రాంత వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని చెప్పిన తరువాత స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక రవాణా చేయకూడదన్న స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్న వాదనలపై కూడా పూర్తి నివేదికలు మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు తయారు చేస్తున్నారు. డిసిల్ట్రేషర్ పేరిట జరుగుతున్న మైనింగ్ ప్రక్రియ కమర్షియల్ అవసరాలకు వినియోగించకూడదన్న విషయాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. స్థానిక అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన ఇసుక ఇతర ప్రాంతాలకు ఎలా వెల్తోంది..? స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక ఎక్కడి నుండి తీసుకొచ్చారు అన్న అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎన్జీటీలో కానీ, కోర్టులో కానీ రెస్పాండెంట్ అడ్వకేట్లు విచారణ సమయంలో హాజరైనందున కోర్టు ఉత్తర్వులు ప్రత్యేకంగా వారి చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉండదని వారి అడ్వకేట్ ద్వారా సమాచారం అందుకున్న తరువాత కూడా మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడడం ధిక్కారం కిందకే వస్తుందని మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు అంటున్నారు. అంతేకాకుండా టీఎస్ఎండీసీ కూడా నిత్యం ఆన్ లైన్ లో విక్రయిస్తున్న ఇసుక వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తుండగా, సంస్థకు ఆర్థిక లావాదేవీలు అయిన విషయంపై కూడా ఆరా తీయాలని కోర్టును, ఎన్జీటీని అభ్యర్థించనున్నారు. అలాగే వైబ్ సైట్ లో నిర్ణీత సమయాల్లో ఇసుక విక్రయాలను ఓపెన్ చేస్తూ ఆ తరువాత ఆ వివరాలు కనిపించకుండా చేస్తున్నారని, ఈ అంశంపై సమగ్రంగా విచారించేందుకు సైబర్ నిపుణుల ద్వారా విచారణ జరిపించాలని కూడా కోర్టును కోరనున్నారు. ఇసుక రీచుల వ్యవహారంలో అన్ని కోణాల్లో కూడా ఆధారాలను సేకరించడం, సాంకేతిక పరమైన విషయాలను బెంచ్ ముందు ఉంచడం కోసం ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా సదరు పిటిషన్లలో అభ్యర్థించాలని భావిస్తున్నారు.