దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణను పట్టి కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వినా కొద్ది కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు విభాగంలో పనిచేస్తున్నామన్న సృహ కూడా లేకుండా ట్యాపింగ్ చేయడమే తప్పంటే… ఏకంగా డివైజ్ కొనుగోలు చేసేందుకు సాహసించడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే డివైజ్ కొనుగోలు చేసిన తీరు పోలీసు ఉన్నతాధికారులను విస్మయపరుస్తోంది. ప్రభుత్వం చెప్పినా… నిబంధనల మేరకు నడుచుకోవాలన్న విషయాన్ని కూడా విస్మరించిన తీరు అధికారులను ఆశ్యర్యానికి గురిచేస్తోంది. చట్టాలకు లోబడి పనిచేయాల్సిన పోలీసు అధికారులు కూడా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ డివైజ్ కొనుగోలు చేయడం విడ్డూరం. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ ద్వారా ఇజ్రాయిల్ నుండి ఫోన్ ట్యాపింగ్ డివైజ్ కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పేరిట ఇజ్రాయిల్ లో కొనుగోలు చేసిన ఈ డివైజ్ ను ఎస్ఐబీలో ఇన్ స్టాల్ చేసి దర్జాగా తమ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ డివైజ్ కోనుగోలు కోసం రవిపాల్ కు భారీగానే డబ్బులు ముట్టజెప్పారని, ఈ డివైజ్ లను రవిపాల్ తో పాటు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావులు దిగుమతి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ డివైజ్ ఏర్పాటు చేసిన చోటుకు 300 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు నేరుగా రికార్డ్ చేసేంత సామర్థ్యం ఉందని కూడా పోలీసులు గుర్తించారు. ఈ డివైజ్ ను రేవంత్ రెడ్డి, రవిపాల్ ఇంటి వద్ద ఏర్పాటు చేసుకుని ఆయన ఇంటి వద్దకు చేరుకుని రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రతి ఒక్కరి మాటలను వినేవారని దర్యాప్తు అధికారులు తేల్చారు.
వాయిస్ లు వినిపించి…
ఓ వైపున రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చే సందర్శకుల మాటలను వింటూనే… మరో వైపున వ్యాపారులు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా వెంటాడరని గుర్తించారు పోలీసు అధికారులు ప్రతిపక్ష పార్టీల నాయకుల టచ్ లోకి వెల్లిన వ్యాపారులను ముప్పు తిప్పలు పెట్టినట్టారని సమాచారం. ప్రతిపక్ష పార్టీల నాయకులతో మాట్లాడిన వ్యాపారులను పిలిపించుకుని బెదిరింపులకు గురి చేసేవారని, తమకేమి తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేసిన వారికి ఏకంగా వారి సంభాషణకు సంబంధించిన ఆడియోలను వినిపించే వారని తెలుస్తోంది. దీంతో ఖంగుతినడం వ్యాపారులను ఫార్టీ ఫండ్ ఇవ్వాలంటూ ఒత్తిళ్లకు గురి చేశారని తేల్చారు. నేరుగా పార్టీకి ఫండ్ ఇవ్వకుండా ఎలక్ట్రోల్ బాండ్లు కొనాలన్న ప్రతిపాదనలను కూడా ఈ టీమ్ వ్యాపారుల ముందు ఉంచినట్టుగా అనుమానిస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ పేరిట అత్యధికంగా ఎలక్ట్రోల్ బాండ్లు సేల్ కావడానికి కూడా కారణంగా ట్యాపింగ్ గ్యాంగేనని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం.