మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై క్రిమినల్ కేస్
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా సద్దుమణిగినట్టుగా లేదు. ఓ కేసులో మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కాగా తాజాగా మాజీ మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేశారన్న అభియోగంపై ఇప్పటికే ఓ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయింది. సిద్దిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ నిర్వాహకుడు గడోని చక్కధర్ గౌడ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వేధింపులకు గురి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడడంతో పాటు చట్ట విరుద్దమైన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి తనపై నిఘా వేశారని చక్రధర్ గౌడ్ ఆ ఫిర్యాదులో వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నందున తన స్వచ్ఛంద సంస్థను హరీష్ రావు టార్గెట్ చేశారన్నారు. తాను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ వల్ల సిద్దిపేటలో ప్రత్యర్థిగా ఎదుగుతానన్న కారణంతో తనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. 2023లో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా తనకు కంపెనీ నుండి వచ్చిన మెయిల్ ద్వారా సమాచారం అందిందని, ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న అనుమానం ఉందన్నారు. సిద్దిపేట ఎన్నికలప్పుడు తన మద్దతు దారులను కూడా బెదిరించారని ఆ ఫిర్యాదులో వివరించారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 1205/2024లో 120(B), 386 IPC, 409, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లతో పాటు 66 ఐటీ యాక్ట్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.