త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ కలిసే అవకాశముంది. విశాఖ వేదికగా ఈ భేటీ ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విశాఖలోని శారదా పీఠంలో జరిగే ఉత్సవంలో ఇద్దరూ కలిసి పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయి. 30వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరిగే అవకాశముంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా జగన్, కేసీఆర్‌ను విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆహ్వానించారు.
స్వరూపానందేంద్ర స్వామితో జగన్, కేసీఆర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వారిద్దరూ సీఎం కావాలని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర రాజశ్యామలయాగం చేశారు. రెండోసారి సీఎం అయిన తర్వాత కేసీఆర్ విశాఖపట్నం వచ్చి శారదాపీఠానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తిరుమల బయులుదేరారు. దీంతో స్వరూపానంద స్వామితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ ఉత్సవానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశముంది. జగన్ కూడా ఈ ఉత్సవానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
దీంతో స్వరూపానంద సమక్షంలో కేసీఆర్, జగన్ కలవనున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురు మాట్లాడుకునే అవకాశముందని చెబుతున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రగతిభవన్‌కు సతీసమేతంగా వెళ్లి కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్, జగన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే ఇద్దరి మధ్య మంచి పరిచయమే ఉంది. దీంతో ఏపీలో ఓట్లను చీల్చి జగన్‌ను అనుకూలంగా మార్చేందుకే కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ విస్తరించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్, కేసీఆర్ కలిస్తే ఆ ప్రచారానికి మరింత బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శారదాపీఠంలో స్వరూపానందేంద్ర స్వామి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారని, ఆ యాగంలో పాల్గొనేందుకే కేసీఆర్, జగన్ వెళుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్, జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటే మరింత ఆసక్తికరంగా మారే అవకాశముంది.కేసీఆర్, జగన్ కలవక చాలా రోజులైంది. చాాలా రోజుల తర్వాత వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటే.. అది రాజకీయంగా కూడా చర్చ జరిగే అవకాశముంటుంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో చూడాలి.