అప్పటి వరకూ ఆడిపాడి… ఆకస్మాత్తుగా ప్రాణం విడిచి…

జగిత్యాల జిల్లాలో విషాదం

దిశ దశ, జగిత్యాల:

అప్పటి వరకు ఆడిపాడిన ఆ నాయకుడు ఆకస్మాత్తుగా నేలకొరిగిపోయాడు. గులాభి దండుతో కలిసి గంతులేసిన ఆయన అందనంత దూరానికి చేరిపోయాడు. చివరి చూపు చూసేందుకన్నట్టుగా మరణం అంచుల నుండి తిరిగి వచ్చినా తిరిగి మృత్యువు తన ఒడిలో చేర్చుకున్న తీరు ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ నాయకుని హఠన్మరణంతో పార్టీ జెండాలతో కళకళలాడుతున్న జగిత్యాల ఒక్కసారిగా మూగబోయింది. ఎవరి నోట విన్నా అయ్యో పాపం అన్న మాటే.. ఎవరి కంట చూసినా కన్నీరే… జగిత్యాలలో మరికొద్ది సేపట్లో ప్రారంభం కావాల్సిన ఆత్మీయ సమ్మేళనానికి ముందు చోటు చేసుకున్న విషాద ఘటన బీఆర్ఎస్ శ్రేణులందరిని కలిచివేసింది.

కొద్దిసేపటి ముందు ఇలా…

జగిత్యాల రైతు సంఘం నాయకుడు, కౌన్సిలర్ బండరి రజని భర్త నరేందర్ హఠన్మారణంతో జగిత్యాల పట్టణమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణానికి ముందు తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా నృత్యం చేస్తూ పార్టీపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. నాయకునిగా ఎదిగినా నరేందర్ మాత్రం సామాన్యుడిలా యాక్టివ్ గా స్టెప్పులేస్తూ ఉరకలేత్తే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అంతలోనే కుప్పకూలిపోయిన నరేందర్ ను సీపీఆర్ చేయడంతో తేరుకోవడంతో హమ్మయ్య గండం గట్టెక్కిందనుకున్నారు. ఉన్నట్టుండి నరేందర్ కిందపడిపోవడంతో అక్కడున్న వారిలో నెలకొన్న టెన్షన్ వాతావరణానికి సీపీఆర్ తరువాత తెరపడింది. విగతజీవిగా మారకముందే ప్రాణాలు కాపాడుకోగలిగామన్న సంతోషంతో సహచర నాయకుల్లో హుటాహుటిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే పనిలో నిమగ్నం అయ్యారు. ఆసుపత్రిలో నరేందర్ కు చికిత్స అందిస్తుండడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకుల్లో మరింత ధీమా పెరిగింది. అంతలో ఆసుపత్రి వర్గాలు దుర్వార్త చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. తమ కళ్ల ముందు ఆడి… కిందపడి.. తేరుకుని కూడా చనిపోయాడన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ తల్లివద్ద ఉన్న నాయకులకు ఈ సమాచారం తెలియగానే వారూ షాక్ కు గురై ఇప్పుడే నడుచుకుంటూ వెళ్లాడు అలా ఎలా జరిగిందన్న తర్జనభర్జనలకు గురవుతున్నారు. అంతలోనే జగిత్యాలకు చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకోవడం ఈ సమాచారం చేరవేయడంతో ఆమె కూడా ఆశ్చర్యపోయారు. కొద్దిసేపట్లో అందరం కలిసి ఆత్మీయంగా మాట్లాడుకుందామనుకోగా పార్టీ నాయకున్ని మృత్యువు కబళించిందన్న వార్త తెలిసి అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

పద్మనాయిక కళ్యాణ మండపంలో నరేందర్ కు నివాళులు

ఆత్మీయతకు బదులు… అమర్ హై నినాదాలు…

ఆత్మీయ వేదికపై నుండి కార్యకర్తలతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకుని, పార్టీని ఎలా బలోపేతం చేయాలోనన్న ప్రసంగాల పర్వం కొనసాగించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా బండారి నరేందర్ మరణించడంతో అదే వేదికపై ఆత్మీయతానురాగాల ఉపన్యాసాలకు బదులు నరేందరన్న అమర్ హై అంటు బీఆర్ఎస్ శ్రేణులు నినదించాల్సి వచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు, పోలీస్ హౌజింగ్ సొసైటీ ఛైర్మన్, పార్టీ ఇంఛార్జి కోలేటి దామోదర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు పార్టీ నాయకులు నరేందర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. కొద్ది సేపటి క్రితం వరకూ పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతుందని అందరూ భావించినా ఎవరి ఊహలకు అందని విధంగా నరేందర్ అందనంత దూరాలకు వెల్లడంతో అదే వేదికపై సంస్మరణ సభ నిర్వహించాల్సి వచ్చింది. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఆయన మరణ వార్త కలిచివేసింది.

You cannot copy content of this page