డిసెంబర్ 2 నుండి పీఎల్జీఏ వారోత్సవాలు…
దిశ దశ, దండకారణ్యం:
భారత విప్లవ చరిత్రలోనే ఆ ఎన్ కౌంటర్ సంచలనం కల్గించింది. కేంద్ర కమిటీ సభ్యులు ఈ ఎన్ కౌంటర్ లో మరణించడం దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. 1999 డిసెంబర్ 2న ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు అడవుల్లో పీపుల్స్ వార్ పార్టీకి చెందిన అతి ముఖ్యమైన నాయకులు ప్రాణాలు వదిలారు. కీకారణ్యంలో లభ్యమైన నాలుగు మృతదేహాల విషయంలో విప్లవ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరూ రాజ్యహింస అంటూ దుమ్మెత్తిపోశారు. అయితే పోలీసులు మాత్రం పీపుల్స్ వార్ పై పట్టు బిగించామని ఇది తమ సక్సెస్ లో కీలకమని ఢంకా బజాయించి చెప్పారు.
ముఖ్య నేతలు…
కొయ్యూర్ అడవుల్లో మరణించిన వారిలో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, శీలం నరేష్ అలియాస్ మురళీ, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేశ్ లు మరణించారని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. దీంతో పీపుల్స్ వార్ భారీ నష్టాన్ని చవిచూసిందనే చెప్పాలి. రక్షణ వలయం నడుము ఉండే అగ్రనేతలు పోలీసులకు చిక్కడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ముగ్గురు ముఖ్య నాయకులు ప్రాణాలు కోల్పోవడం మాత్రం పార్టీ ఉనికికే సవాల్ విసిరన పరిస్థితి. కోవర్డులు పార్టీలోకి చొరబడి తమ ఉద్యమ పంథాను అంతం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పార్టీ నిర్మాణంతో పాటు మిలటరీ శిక్షణ ఉండాలన్న లక్ష్యాన్ని నిర్దేశించిన నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యాం కూడా ఈ ఎన్ కౌంటర్ లో హతం కావడంతో 2000 డిసెంబర్ 2 నుండి వారం రోజుల పాటు పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తోంది. అంతకుముందు పీపుల్స్ గెరిల్లా ఆర్మీగా ఉన్న పేరును ఆ తరువాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీగా మార్చిన పీపుల్స్ వార్ ఏటా డిసెంబర్ 2 నుండి వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది 24 ఏళ్ల పీఎల్జీఏ ఆవిర్బావోత్సవాలు నిర్వహించేందుకు పార్టీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ (CMC) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సారి పీఎల్జీఏ వారోత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని, విప్లవ పంథాలో మరణించిన వారికి జోహార్లు అర్పించడంతో పాటు గాయాలపాలై చికిత్స పొందుతున్న విప్లవకారులంతా త్వరగా కోలుకుని ఉద్యమం వైపు సాగాలని ఆకాంక్షించింది.
పీఎల్జీఏ విజయాలివే…
మావోయిస్టు పార్టీ సైన్యంగా ఏర్పాటు చేసుకున్న సెంట్రల్ మిలటరీ కమిషన్ ఈ ఏడాది జనవరి నుండి ఆపరేషన్ ‘‘కగార్’’ను తిప్పికొట్టడంలో సఫలం అవుతోందని, పెద్ద ఎత్తున బలగాలు అడవుల్లోకి చొచ్చుకుని వచ్చినప్పటికీ ఎదురొడ్డి పోరాడడంలో పీఎల్జీఏ దూకుడు ప్రదర్శిస్తోందని CMC వెల్లడించింది. ఎన్ కౌంటర్లకు ధీటుగానే తాము కూడా బలగాలపై పై చేయి సాధిస్తున్నామని తన నివేదికలో పేర్కొంది. దండకారణ్యంలోని సౌత్ బస్తర్ ధర్మారం క్యాంపుపై దాడి చేశామని ఇక్కడ 500 మంది మిలటరీ కమోండోలు ఉన్నారని, నాలుగు వైపులా సీఎంసీ సభ్యులు చుట్టుముట్టి క్యాంపుపై దాడికి పూనుకున్నామని పేర్కొంది. 1000 ఎస్.జీ.ఎల్. (స్పైగాట్ గ్రేనేడ్ లాంఛర్) షెల్స్ తో షెల్లింగ్ చేసి బలగాల క్యాంపుపై దాడి చేశామని వివరించింది. పారామిలటరీ బలగాలకు, పీఎల్జీఏ సైన్యానికి మధ్య జరిగిన ఈ పోరాటంలో 35 మంది పోలీసులు చనిపోయారని, 40 మంది వరకూ గాయపడ్డారని తెలిపింది.. అయితే పీఎల్జీఏ దాడిలో తమకు అంతగా నష్టం వాటిల్లలేదని కేవలం నలుగురు మాత్రమే చనిపోయారని 9 మంది గాయపడ్డారని తప్పుడు ప్రకటన విడుదల చేశారని ఆరోపించింది. వాస్తవాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారని పేర్కొంది. ఈ తరువాత జనవరి 16న సౌత్ బస్తర్ డివిజన్ లో జీరగూడెం బేస్ క్యాంపుపై దాడి చేశాయని వివరించింది. ఇందులో తెలంగాణ, దండకారణ్య, రీజనల్ పీఎల్జీఏ బలగాలు పాల్గొని క్యాంపు సమీపంలో అంబూష్ నిర్వహించి దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లను మరణిచంగా 15 మందికి గాయాలయ్యాయని వివరించింది. మార్చి నుండి జూన్ వరకు బలగాలు టీసీఓసీని కొనసాగించగా తాము చేసిన దాడుల్లో 11 మంది పారా మిలటరీ జవాన్లు చనిపోగా, 21 మంది గాయపడ్డారని పేర్కొంది. సూట్ బాయి, పొత్ కేల్, జీరగూడెం, ధర్మారం, మడకగూడెం క్యాంపులపై షెల్లింగ్ చేశామని, 545 మంది ప్రజలను సమీకరించి దక్షిన బస్తర్ డివిజన్ లో 5347 గుంతలు తవ్వి వాటిలో వేల సంఖ్యలో ఇనుప, కొయ్య కర్రలను (స్పైక్స్)ను అమర్చామని పేర్కొంది. పశ్చిమ బస్తర్ దర్బా డివిజన్, ఏఓబి బలగాలు కలిసి కొన్ని గెరిల్లా యుద్ద చర్యలు నిర్వహించాయని, ఉత్తర సబ్ జోనల్ ఏరియాలో టీసీఓసీ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, 23 మంది పోలీసులు గాయపడ్డారని వెల్లడించింది. నార్త్ సబ్ జోనల్ లో రెండు పార్వర్డ్ ఆపరేషన్ బేస్ క్యాంపులపై పీఎల్జీఏ బలగాలు దాడులు చేశాయని, వెస్ట్ సబ్ జోనల్ లో అంబూష్ చేసి ఇద్దరు పోలీసులను గాయపర్చాయని పేర్కొంది. బీహార్ ఝార్ఖండ్, తూర్పు బీహార్ ఈశాన్య ఝార్ఖండ్ ప్రాంతంలో వేల సంఖ్యలో బూబిట్రాప్స్ అమర్చి పోలీసులపై ఫైరింగ్ చేసి పలువురిని నిర్మూలించామని పెద్ద సంఖ్యలో గాయాల బారిన పడ్డారని ఈ నివేదికలో వివరించింది. దండకారణ్యం, బీహార్, ఝార్ఖండ్, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల్లో జరిగిన ఎన్ సర్కిల్ మెంట్ దాడిలన్నింటిని పీఎల్జీఏ సైన్యం తిప్పికొట్టిందని ఈ ఘటనల్లో కూడా బలగాలు తీరని నష్టాన్ని చవి చూశాయని పేర్కొంది. అయితే మరణాల గురించి ప్రకటిస్తే బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, పీఎల్జీఏ సామర్థ్యం బయటపడుతుందని వాస్తవాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపించింది. ఈ ఏడాదిలో అక్టోబర్ వరకు దండకారణ్యం, బీహార్, ఝార్ఖండ్, తెలంగాణ, ఒడిషా, ఏంఎంసీ ప్రాంతాల్లో 100 వరకూ గెరిల్లా యుద్ద దాడులు జరిగాయని, వీటిలో 65 మంది జవాన్లు మరణించగా 120 మంది గాయపడ్డారని వెల్లడించింది. ముగ్గురు రహస్య సైనికులను, 29 మంది ఇన్ ఫార్మర్లను, ముగ్గురు కోవర్టలను, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఆరుగురు ప్రజా వ్యతిరేక నాయకులను పీఎల్జీఏ బలగాలు నిర్మూలించాయని మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ వివరించింది. 25 నుండి 30 వాహనాలను, కొన్ని మొబైల్ టవర్స్ ను కూడా కాల్చివేశాయని, దేశ వ్యాప్తంగా ఎన్ సర్కిల్ మెంట్ దాడుల్లో 100 ఎన్ కౌంటర్లు జరగగా, ఇందులో పీఎల్జీఏ సైన్యం ప్రతిఘటించడంలో సపలం అయ్యాయని చెప్పుకొచ్చింది. 10 నెలల్లో సూరజ్ కుండ్ వ్యూహాత్మకపు దాడిని, కగార్ దాడిని విఫలం చేసేందుకు పీఎల్జీఏ సైన్యం రెయిడ్, అంబూష్, స్పెపర్ దాడులకు పాల్పడడం, బూబిట్రాప్, రిమోట్ చర్యలు, బేస్ క్యాంపులపై షెల్లింగ్ దాడులు, ఇన్ ఫార్మర్లు, కోవర్టుల నిర్మూలన, విప్లవ వ్యతిరేకుల నిర్మూలన, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల నిర్మూలన, స్పెక్ హోల్స్ అమర్చడం వంటి చర్యలతో గెరిల్లా యుద్దాన్ని కొనసాగించాయని వివరించింది.
వైఫల్యాలు ఇవే…
మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ తన వైఫల్యాలను కూడా ఈ నివేదికలో వివరించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గెరిల్లా యుద్ద చర్యల విస్తృతి, తీవ్రత తగ్గిందని పోలీసులను నిర్మూలించే చర్యలు తగ్గిపోయాయని పేర్కొంది. ఈ ఏడాది బలగాల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకోలేకపోయామని, కగార్ దాడుల్లో పీఎల్జీఏ బలగాలు, ప్రజా సంఘాలను కోల్పోయామని పేర్కొంది. ఫలితంగా పార్టీ, ఫీఎల్జీఏ ఐక్య సంఘటన నిర్మాణాలు బలహీనపడడంతో విప్లవోద్యమాలు తాత్కాలికంగా వెనకంజ వేశాయని ఆభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవ ప్రాంతంలో దాదాపు 8 లక్షల సాయుధ బలగాలను, భారత సైన్యాన్ని, వాయు సేనలను మోహరించి కార్పెట్ వ్యవస్థను సంఘటిత పర్చినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ప్రజలను చైతన్యపర్చి పోరాటాలను కొనసాగిస్తున్నదని ప్రకటించింది. బస్తర్ రీజియన్ లో ఫిబ్రవరి 15న ‘‘నియాద్ నెల్లతానార్’’ (నీది మంచి ఊరు) అనే నినాదంతో పలు సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రక్రయకు చత్తీస్ గడ్ ప్రభుత్వం మొదలు పెట్టిందని, 14 కొత్త బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 5 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఇందులో భాగంగా 25 మౌళిక సదూపాయాల కల్పన, 32 పథకాలను అమలు చేస్తున్నాయని వివరించింది. ఈ పథకాలేవి కూడా ప్రజల ఉత్పాదక శక్తిని పెంచేవి కావని, వాటి లబ్దిదారులు చేర్చి వారిని బికారీలుగా చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది.