ద్వితీయ శ్రేణి నాయకుల్లో అయోమయం
బీఆర్ఎస్ కౌన్సిలర్ కు పోలీసుల పిలుపు
దిశ దశ, వేములవాడ:
ఇంతకాలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులకు మాత్రమే పోలీసుల నుండి పిలుపులు వచ్చేవి. రాష్ట్రంలో అధికార పార్టీ ముఖ్య నేతల టూర్ ఉందంటే చాలు బీఆర్ఎసేతర పార్టీల నాయకులు ఠాణాలకు చేరుకోవల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా పోలీసుల నుండి పిలుపులు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
వేములవాడలో ఆదివారం బీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహరావు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ విషయంలో పోలీసులు ఆదివారం డే టైంలోనే పిలిపించిన పోలీసులు ఆ ఫ్లెక్సీలను తొలగించాలని సూచించడంతో ఆయన వినలేదు. తమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తే తప్పేంటన్న ఉద్దేశ్యంతో నిమ్మశెట్టి విజయ్ పోలీసుల సూచనను తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్ విజయ్ ఇంటికి వెల్లి మరీ సార్ రమ్మంటున్నారని చెప్పడం విడ్డూరం. ఇంత రాత్రి వేళ తనను ఎందుకు రమ్మంటున్నారంటూ కౌన్సిలర్ విజయ్ ప్రశ్నించినప్పటికీ కానిస్టేబుల్ తనకేం తెలియదని సమాధనం ఇచ్చారు. దీంతో విజయ్ కుమార్ ఎస్సైకి ఫోన్ చేసి తాను రానని మరోసారి చెప్పారు. అయితే అధికార పార్టీ కౌన్సిలర్ ను అయిన తనకు పోలీసుల నుండి పిలుపు రావడం ఏంటి అన్నదే అంతుచిక్కకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయ్. తమ పార్టీ నాయకుని బర్త్ డే విషెస్ కూడా చెప్పే పరిస్థితి లేకుండా పోయిందా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చల్మెడ లక్ష్మీనరసింహరావుకు అనుకూలంగా ఉంటున్నందునే తనకు ఇలాంటి పిలుపులు వస్తున్నాయన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకులను కూడా మచ్చిక చేసుకునేందుకు పోలీసులను అస్త్రంగా ప్రయోగిస్తున్నారా అన్న చర్చ మొదలైంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post