కుంగింది ఒకటే పిల్లర్…

ఎల్ అండ్ టి ఇంజనీర్ల రాక

పోలీసులకు ఫిర్యాదు

దిశ దశ, భూపాలపల్లి:

జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయంలో ఇంజనీర్లు మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. బ్యారేజీలోని ఒక పిల్లర్ వద్ద కుంగిపోయిందని విచారణ జరపాలని ఆ కంప్లైంట్ లో ఇంజనీర్ కోరినట్టు తెలుస్తోంది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టి ఇంజనీర్ల బృందం క్షేత్ర స్థాయి పరిశీలనకు రానున్నట్టుగా తెలుస్తోంది. డిజైన్ ఇంజనీర్లు బ్యారేజ్ వద్దకు వచ్చి కుంగిపోయిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎలా జరిగింది, కుంగిపోయిన ప్రాంతాన్ని సవరించడం ఎలా అన్న అంశాలపై ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. ఎల్ అండ్ టి డిజైన్ ఇంజనీర్ల బృందం మేడిగడ్డ వద్దకు వచ్చి నివేదిక ఇచ్చిన తరువాత మాత్రమే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారీ శబ్దం…

మరో వైపున శనివారం సాయంత్రం బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిన సమయంలో భారీగా శబ్దం వినిపించిందంటూ ఇంజనీర్లు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ శబ్దం వచ్చిన వెంటనే బ్యారేజ్ బ్రిడ్జిపైకి వెల్లి చూస్తే పిల్లర్ ఒకటి కుంగిపోయిందని చెప్తున్నట్టుగా సమాచారం. అయితే బ్యారేజీని కావాలనే ఎవరో డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించి ఉంటారన్న అనుమానాలు ఈ ప్రచారంతో వస్తున్నాయి. కానీ బ్యారేజ్ వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం అక్కడే ఉండడంతో పాటు, ఇదే బ్యారేజ్ పై అంతరాష్ట్ర చెక్ పోస్టు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద పోలీసులు ఉంటారని ఇలాంటి పరిస్థితుల్లో బ్యారేజీని డ్యామేజ్ చేసేందుకు ఎవరు వచ్చే అవకాశం ఉండదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page