దిశ దశ, హుజురాబాద్:
జమ్మికుంట మునిసిపల్ కార్యాలయం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించారు. ఓ వైపున అవిశ్వాస రాజకీయాలు తెరపైకి రాగా మరో వైపున జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. గురువారం మునిసిపల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ప్రకటించారు.
అవిశ్వాస రాజకీయాలు…
అయితే జమ్మికుంట సిట్టింగ్ ఛైర్మన్ రాజేశ్వర్ రావుపై 23వ వార్డు కౌన్సిలర్ పొనుగంటి మల్లయ్య ఆధ్వర్యంలో అవిశ్వాస నోటీసు ఇచ్చారు. మొత్తం 18 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నారంటూ మల్లయ్య జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం అసమ్మతి నాయకులంతా కూడా క్యాంపు రాజకీయాల్లోకి వెల్లిపోవడంతో జమ్మికుంటూ మునిసిపాలిటీలో హై టెన్షన్ మొదలైంది. అయితే పొనుగంటి మల్లయ్య క్యాంపు నుండి ముగ్గురు కౌన్సిలర్లు తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు వర్గంలో చేరారు. దీంతో 30 మంది కౌన్సిలర్లలో 15 మంది చొప్పున రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా అవిశ్వాసం కోసం ఇచ్చిన నోటీసు చెల్లదని రాజేశ్వర్ రావుకు కూడా 15 మంది అనుకూలంగా ఉన్నారంటూ కలెక్టర్ కు వినతి చేశారు. అంతేకాకుండా తమ పార్టీ విప్ ను ధిక్కరించి, కాంగ్రెస్ పార్టీలో చేరిన పొనుగంటి మల్లయ్య సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ను అభ్యర్థించారు. అనంతరం పొనుగంటి మల్లయ్య వర్గం హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన క్యాంపులోకి రాజేశ్వర్ రావు వర్గం వెల్లడంతో ఇరువర్గాల మధ్య గొడం చోటు చేసుకుంది మొదట కూకట్ పల్లి, ఆ తరువాత నగర శివార్లలో ఏర్పాటు చేసుకున్న ఈ క్యాంపు గురించి తెలుసుకుని అక్కడకు రాజేశ్వర్ రావు వర్గం చేరుకోవడంతో ఆందోళనల వరకు సాగింది. అయితే ఇదే క్రమంలో మునిసిపల్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు రాజేశ్వర్ రావు. గురువారం జరగనున్న ఈ సమావేశానికి ఇరు వర్గాలకు చెందిన సభ్యులు హాజరయినట్టయితే మళ్లీ గొడవలు జరిగే ప్రమాదం ఉందన్న కారణంతో పోలీసులు భారీ ఎత్తున బందో బస్తు చేపట్టారు. ఇప్పటికే క్యాంపుల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.
వ్యూహం అదేనా..?
అయితే అనూహ్యంగా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు వెనక బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యూహం వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి హాజరు కానీ కౌన్సిలర్లకు పార్టీ విప్ జారీ చేసినా ధిక్కరించారని వారిపై కూడా అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కౌశిక్ రెడ్డి కూడా ఈ మునిసిపాలిటీలోనే ఓటు హక్కును నమోదు చేయించుకుని తమ పార్టీ ఛైర్మన్ రాజేశ్వర్ రావు గద్దె దిగకుండా ఉండేందుకు వ్యూహం రచించుకున్నట్టుగా కూడా సమాచారం.