లుంగీలు కట్టి… తల పాగలు చుట్టి… తెలంగాణ పోలీసుల సరికొత్త వేషం

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అసాంఘీక చర్యలకు పాల్పడే నిందితులు వేషం మార్చుకుని తిరిగినట్టుగానే ఇక్కడి పోలీసులు యూనిఫామ్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. తలకు పాగ చుట్టి… లుంగీలు కట్టుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు కార్య రంగంలోకి దిగారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను గమనించి పరార్ అవుతున్నారు. దీంతో ఇలాంటి వారిని ఎలాగైనా పట్టుకోవాలని భావించిన కాఖీలు వేషధారణ మార్చి కార్యరంగంలోకి దూకారు. జిల్లాలోని ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో జోరుగా జూదం ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అయితే సాధారణంగా కాఖీ యూనిపామ్స్ కనిపించగానే వారు పరార్ అవుతారని భావించిన పోలీసులు కూలీల వేషం వేసుకుని వెల్లారు. బందన్ కల్ గ్రామ  శివార్లలో సాగుతున్న పేకాట  స్థావరాలను కట్టడి చేయాలని భావించిన సీఐ మొగిలి సరికొత్త స్కెచ్ వేశారు. పేకాటరాయుళ్ల అడ్డాలను గుర్తించి తమ సిబ్బందిని మారు వేషంలో వెళ్లాలని సూచించారు. దీంతో అక్కడి పోలీసులు లుంగీలు కట్టుకుని తలకు రుమాలు చుట్టుకుని వెల్లడంతో పేకాట రాయుళ్లు పొలాల్లో పనిచేసే కూలీలుగా భావించి జూదం ఆడడంలో మునిగిపోయారు. పోలీసులు వారిని సమీపించి చుట్టు ముట్టముట్టిన తరువాత కానీ జూదగాళ్లకు అర్థం కాలేదు వచ్చింది కూలీలు కాదు… కాఖీలు అని. కానీ అప్పటికే పోలీసులు పేకట స్థావరాన్ని కవర్ చేయడంతో అక్కడ గేమ్ ఆడుతున్న జూదగాళ్లు పోలీసులకు చిక్కకతప్పలేదు. పేకాట రాయుళ్ల నుండి కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ముస్తాబాద్ మండలంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గేమింగ్ యాక్టు అమలు చేసేందుకు పోలీసులు వేసిన ఈ ప్లాన్ గురించి విన్న వారంతా కూడా భలేగా వ్యవహరించారు పోలీసులు అని కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా పోలీసులు మారువేషాల్లో సంచరించిన సందర్బాలు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మాత్రం అమలు చేసిన వారు లేరనే చెప్పాలి. నేరాల్లో పాల్గొని తప్పించుకుని తిరుగుతున్న ఘరానా నేరస్తుల కోసం, నక్సల్స్ ఆచూకి కోసం పోలీసులు వేషధారణ మార్చి వారి ఆచూకి కోసం ప్రయత్నించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పోలీసులు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన సందర్భాలు మాత్రం లేవు.

You cannot copy content of this page