ఒంగోలు రోడ్లపై అసలేం జరిగింది..?

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఏపీలోని ఒంగోలు రోడ్లపై నెలకొన్న వాతావరణంతో స్థానికులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న బలగాలు లాఠీలను ఝులిపించడం… రోడ్లపై టైర్లు కాల్చేయడం, తుపాకులకు పని చెప్పడంతో అసలేం జరుగుతోందని స్థానికులు ఉత్కంఠతకు లోనయ్యారు. పోలింగ్ తరువాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న గొడవల నేపథ్యంలో ఒంగోలు పట్టణంలో కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయేమోనని కలత చెందారు. అయితే పోలీసు అధికారులు ముందస్తుగా చేపట్టిన చర్యల్లో భాగంగా చేపట్టిన మాక్ డ్రిల్ అని తెలుసుకుని స్థానికులు అక్కడ జరిగిన సన్నివేశాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయడం ప్రారంభించారు. పోలింగ్ తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠతకు రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. మే 13న చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 33 కేసులు కూడా నమోదు కాగా మొత్తం 1370 మంది నిందితులుగా పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఎలాంటి ఉద్రికత్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఒంగోలు పోలీసు అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని కట్టడి చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆందోళనలను నిలువరించేందుకు ఎలా వ్యవహరించాలి అన్న విషయంపై చేపట్టిన ఈ మాక్ డ్రిల్ వల్ల పోలీసులకు ప్రాక్టికల్ అవగాహన వస్తుందని ఆశిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత అంచనాలు తారుమారయ్యాయని ఆయా పార్టీల నాయకులు అల్లర్లకు దిగినట్టయితే వారిని వెంటనే నిలువరించడంలో భాగంగానే మాక్ డ్రిల్ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు.


You cannot copy content of this page