బెటాలియన్ కమాండెంట్ గంగారం మృతి
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
లిఫ్ట్ లో పడిపోయిన బెటాలియన్ కమాండెంట్ మృత్యువాత పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో ఆయన లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసిన తరువాత డోర్ ఓపెన్ కావడంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలకు అడుగుపెట్టగానే జారి పడిపోయారు. కింది ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ మూడో అంతస్తులోకి వస్తున్న క్రమంలో పడిపోవడంతో ఆయన మృత్యువాత పడ్డారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దుల గ్రామానికి చెందిన తోట గంగారం (58) సిరిసిల్లలోని 17వ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేసిన ఆయన మూడు నెలల క్రితమే రాజన్న సిరిసిల్లలోని 17వ బెటాలియన్ కు బదిలీ అయ్యారు. సోమవారం రాత్రి ఓ అపార్ట్ మెంట్లో ఉన్న సహచర పోలీసు అధికారిని కలిసి తిరిగి ఇంటికి వెల్తున్న క్రమంలో లిఫ్ట్ వద్దకు చేరుకుని బటన్ ప్రెస్ చేశారు. అంతలోనే లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతో లిఫ్ట్ వచ్చి ఉంటుందని భావించి ఆయన లోపలకు అడుగుపెట్టగానే పట్టుతప్పి పడిపోయారు.. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఫైర్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సాయంతో గంగారంను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృత్యువాత పడ్డారని వైద్యులు తెలిపారు. అయితే లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుండి మూడో ఫ్లోర్ కు వస్తున్న క్రమంలో డోర్ ఓపెన్ కావడంతో కమాండెంట్ గంగారం మృతి చెందినట్టుగా పోలీసు అధికారులు ధృవీకరించారు.
డోర్ ఓపెన్ ఎలా అయింది..?
సాధారణంగా బహుళ అంతస్తుల భవనాల్లో ఏర్పాటు చేసే లిఫ్టు డోర్లు ఓపెన్ కావడం అనేది జరగదు. లిఫ్ట్ ఏ ఫ్లోర్ లో ఉంటే అదే ఫ్లోర్ లో డోర్ ఓపెన్ అవుతుంది తప్ప ఫ్లోర్ లెవల్ కు చేరడంలో ఏ మాత్రం హెచ్చు తగ్గులు ఉన్నా డోర్ ఓపెన్ కావడం అసాధ్యం. లిఫ్ట్ టెక్నిషియన్లు కూడా ఈ విధానంతోనే భవనాల్లో వాటిని ఏర్పాటు చేస్తుండడం సహజం. కానీ సిరిసిల్ల అపార్ట్ మెంట్లో మాత్రం 17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారం మూడో ఫ్లోర్ లో లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ అక్కడకు చేరకముందో డోర్ ఓపెన్ కావడంతో లోపలకు అడుగు పెట్టి ప్రాణాలు కోల్పోయారు. గ్రిల్స్ డోర్ లిఫ్ట్ సదరు ఫ్లోర్ కు చేరిన తరువాత లాక్ ఓపెన్ అయ్యే విధానాన్ని సెట్ చేస్తారు. కానీ ఈ ఘటనలో లిఫ్ట్ మూడో ఫ్లోర్ కు చేరకముందే డోరు
తెరుచుకోవడం గమనార్హం. లిఫ్ట్ లో సాంకేతిక సమస్య ఎదురైతే మధ్యలో నిలిచిపోవడం వంటివి జరుగుతాయి కానీ లిఫ్ట్ సంబంధిత ఫ్లోర్ చేరక ముందే డోర్ ఓపెన్ కావడం వెనక నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం అర్థరాత్రి వేళ జరిగిన ఈ ఘటనలో పోలీసు అధికారి మృత్యువాత పడడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అపార్ట్ మెంట్లో చిన్న పిల్లలు కూడా ఇదే పద్దతిలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయినప్పుడు అందులో కాలు పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యేవో అర్థం చేసుకోవచ్చు. సాంకేతిక లోపం ఉన్నట్టయితే మెయింటనెన్స్ చేయించడంలో విఫలం అయ్యారా అన్న విషయంపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. అపార్ట్ మెంట్లలో లిఫ్ట్ ను ఏర్పాటు చేయించినప్పుడే కొంతకాలం మెయింటనెన్స్ బాధ్యతలు సదరు కంపెనీపై ఉంటాయి. సాంకేతిక సమస్య ఎదురయినప్పుడు బిల్డర్ కానీ, లిఫ్ట్ కంపెనీ ప్రతినిధులు కానీ అపార్ట్ మెంట్ కమిటీ కానీ చూసుకోవల్సిన అవసరం ఉంటుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు అసలు లోపం ఏంటీ..? బాధ్యులు ఎవరు అన్న కోణంలో కూడా విచారణ జరిపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్ట్ వినియోగం తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయినట్టయితే అపార్ట్ మెంట్లలో నివాసం ఉండే వారి ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది. బల్దియా అధికారులు ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చి బాధ్యులపై నిబందనల మేరకు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిల్డర్ కూడా భవనాన్ని కట్టిన తరువాత ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి అప్పగించడంతో సరిపెట్టకూడదని, కొంతకాలం పాటు బిల్డర్ బిల్డింగ్ నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది. మునిసిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అపార్ట్ మెంట్ నిర్మాణం విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గత అనుభవాలూ…
గతంలో లిఫ్ట్ ప్రమాదాలు చాలా జరిగాయి. మంత్రులు కూడా లిఫ్ట్ లో ఇరుక్కున్న సందర్భాలు లేకపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున కన్నెపల్లి పంప్ హౌజ్ లిఫ్ట్ జామ్ కావడంతో అప్పటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి చాలా సేపు అందులోనే చిక్కుకపోయారు. సాంకేతిక సిబ్బంది వచ్చి లిఫ్టును బాగు చేసే వరకూ ఆయన అందులోనే ఉండిపోవల్సి వచ్చింది. కరీంనగర్ లోని ప్రైవేటు హస్పిటల్స్ ప్రారంభోత్సవంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి చిక్కుకపోయారు. సామర్థ్యానికి మించి లిఫ్టులో వెల్లేందుకు సాహసించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్న వాదనలు వినిపించారు. అయితే ఇందుకు సాంకేతిక లోపాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణాలతో పాటు లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటిని కూడా పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.