నాడు ఏరివేత… నేడు ఓట్ల అభ్యర్థన… ఇద్దరు పోలీసు అధికారుల తీరు

స్టేట్ క్యాడర్ ఒకరు… డైరక్ట్ ఆఫీసర్ మరోకరు…

ఇద్దరూ దళిత అధికారులే…

దిశ దశ, హైదరాబాద్:

రెండున్నర దశాబ్దాల క్రితం ఉత్తర తెలంగాణాలో పేరొందిన పోలీసు అధికారుల జాబితాలో వారిద్దరు కూడా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన ఆ ఇద్దరు అధికారులు ఇప్పుడు ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టారు. ఎన్నికల వాతావరణం నెలకొన్న తరువాత రాష్ట్రంలో తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో పరీక్షించుకోవాలని పలువురు రిటైర్డ్ పోలీసు అధికారులు ప్రయత్నించినా అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో పోటీలో ఉన్న వారికి మద్దతు ఇచ్చే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే వారిలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇద్దరు రిటైర్డ్ అధికారులు ప్రజా క్షేత్రంలో తమ సత్తా ఏమిటో పరిక్షించుకుంటున్నారు.

అక్కడ ఐపీఎస్…

దక్షిణ తెలంగాణాలోని అలంపూర్ కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెటర్నరీలో డిగ్రీ పూర్తి చేసి ఐపీఎస్ అయ్యారు. వామ పక్ష భావజాల అణువు అణువునా నింపుకున్న ప్రవీణ్ కుమార్ ను అప్పటి సీనియర్ పోలీసు అధికారి ఒకరు కౌన్సిలింగ్ నిర్వహించి ఐపీఎస్ అధికారి కావడానికి కారకులు అయ్యారు. పుట్టింది… పెరిగింది పాలమూరు బిడ్డగానే అయినప్పటికీ ఆయన విధి నిర్వహణ అంతా కూడా ఉత్తర తెలంగాణతోనే మమేకమై ఉంది. బెల్లంపల్లి ఆ తరువాత వరంగల్, కరీంనగర్ లో పనిచేశారు. అడిషనల్ డిజీపీ స్థాయికి చేరిన ప్రవీణ్ కుమార్ ఉద్యోగ అనుబంధం మాత్రం ఎక్కువగా నార్త్ తెలంగాణ జిల్లాలలోనే గడిచిపోయింది. అనూహ్యంగా ఐపీఎస్ కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన ప్రవీణ్ కుమార్ తెలంగాణాతో ఏనుగు గుర్తుకు ఫెవికాల్ బంధంలా అనుబంధం పెనవేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్పీ రిజర్వేషన్ నియోజకవర్గాలను కాదని సిర్పూర్ ను ఎంచుకున్నారు. ఇక్కడ బలమైన ప్రతర్థిగా ఉన్న కోనేరు కోనప్పతో తలపడుతున్న ఆర్ఎస్పీ టఫ్ ఫైట్ కొనసాగిస్తున్నారు. సిర్పుర్ ప్రాంతంలో ఉన్న కొన్ని ఆర్గనైజేషన్లు ఆయనకు బలాన్ని చేకూరుస్తున్నాయని బీఎస్పీ పార్టీ వర్గాలు అంటున్నాయి. అసాంఘీక శక్తులను ఏరివేసేందుకు చట్టాలను ఉపయోగించాల్సిన పోలీసు విభాగానికి బైబై చెప్పిన ప్రవీణ్ కుమార్ చట్టాలను సిద్దం చేసే అసెంబ్లీలో అడుగు పెట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇక్కడ స్టేట్ క్యాడర్…

ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆపరేషన్స్ అడిషనల్ ఎస్పీగా ప్రవీణ్ కుమార్ పని చేశారు. ఆ సమయంలో పరకాలలో క్షేత్ర స్థాయి అధికారిగా ప్రస్తుత వర్దన్నపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగరాజు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో నక్సల్స్ ప్రాబల్యం తీవ్రంగా ఉండడంతో ఇద్దరు అధికారులు కూడా అసాంఘీక శక్తుల ఏరివేతే లక్ష్యంగా పనిచేశారు. ఆపరేషన్స్ ఓఎస్డీగా ప్రవీణ్ కుమార్ పనిచేస్తున్నప్పుడు నాగరాజు పరకాల ప్రాంతంలో ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలో తరుచూ చర్చించుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. నాగరాజు ఐపీఎస్ గా ఎదిగి పదవి విరమణ పొంది వర్దన్నపేట నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న అనుకూల పవనాలతో పాటు తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాలు కలిసి వస్తాయని నాగరాజు అంచనా వేస్తున్నారు.

You cannot copy content of this page