సరిహద్దులపై పకడ్భందీ నిఘా…

చెక్ పోస్టులు ఓ వైపున

కూంబింగ్ ఆపరేషన్లు మరో వైపున

ఎన్నికల వేళ అప్రమత్తం అయిన పోలీసులు

దిశ దశ, దండకారణ్యం:

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న యంత్రాంగం అలెర్ట్ గా ఉంటూ నక్సల్స్ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు పోలీసు అధికారులు. ఈ మేరకు సరిహధ్దు జిల్లాల్లో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు నోటిఫికేషన్ విడుదల కాగానే అప్రమత్తత చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.

రెండు రాష్ట్రాల్లోనూ…

మావోయిస్టు పార్టీ సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న దండకారణ్య అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న చత్తీస్ గడ్ తో పాటు, తెలంగాణాలోనూ ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తూ మావోయిస్టులను కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారు పోలీసు అధికారులు. చత్తీస్ గడ్ సరిహద్దులు విస్తరించి ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండలం నుండి కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని చర్ల ఏరియా వరకు కూడా నిరంతరం నిఘా పర్యవేక్షణ కొనసాగిల్సిందేనని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఏపీ సరిహద్దు ప్రాంతంలో కూడా అలెర్ట్ గా ఉండాలని ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి కూడా మావోయిస్టులు తెలంగాణాలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నందున ఆ ప్రాంతంలోనూ నిఘా కట్టుదిట్టం చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. మరో వైపున మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమన్ పల్లి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ ప్రాంతాల్లోనూ పోలీసులు అప్రమత్తంగా ఉండనున్నారు. ప్రాణహిత, గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ఫెర్రీ ఏరియాలో ఎప్పటికప్పుడు నిఘా కట్టుదిట్టం చేయడంతో పాటు అవసరమున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసే యోచనలో పోలీసు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. నదుల మీదుగా వచ్చిపోయే వారిని ప్రత్యేకంగా కనిపెట్టుకుంటూ ఉండాలని కూడా ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ములుగు జిల్లా సరిహధ్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని బలగాలు విచ్ఛిన్నం చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టు పార్టీ అగ్రనేతల కన్ను తెలంగాణాపై ఉందన్న విషయాన్ని గమనించిన పోలీసులు కట్టదిట్టమైన భద్రాతా చర్యలు తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. రాష్ట్రానికి చెందిన గ్రౌహౌండ్స్ తో పాటు పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలచే కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే గోదావరి, ప్రాణహిత నదుల మీదుగా వంతెనలు వేసిన ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు ఆయా ప్రాంతాల మీదుగా వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కూడా ఆదేశించారు. మరోవైపున సరిహద్దు ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతే వదిలేయాలన్న ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు ఉన్నట్టయితే వారి కదలికలపై నజర్ వేయడంతో పాటు, స్థానికంగా ఉన్న మాజీలు, కొరియర్లను కూడా కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు బందోబస్తు చర్యలు తీసుకుంటున్న తీరుకు నది పరివాహక ప్రాంతాలైన ఐదు జిల్లాల్లో చేపడుతున్న భద్రాతా చర్యలకు సంబంధం లేకుండా ఉందనే చెప్పాలి. ఎన్నికలను ఆసరాగా తీసుకుని మావోయిస్టులు రాష్ట్రంలోకి వచ్చినట్టయితే విధ్వంసాలకు పాల్పడడమో లేక టార్గెట్లను హతమార్చడమో చేసే అవకాశాలు ఉన్నందున వారు రాష్ట్రంలోకి రాకుండా నిలువరించడమే లక్ష్యంగా పెట్టుకుని పకడ్భందీ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

You cannot copy content of this page