దిశ దశ, దండకారణ్యం:
ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలపై మహారాష్ట్ర పోలీసులు పకడ్భందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ప్రచారం కోసం అటవీ ప్రాంతాల్లో పర్యటించే పొలిటికల్ లీడర్లు, సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించే బలగాలను లక్ష్యం చేసుకుని పేల్చివేతలకు పాల్పడేందుకు మావోయిస్టులు మందుపాతరలను అమర్చుతున్నారు. అయితే ఎన్నికల్లో నక్సల్స్ చేయ తలపెట్టిన విధ్వంసాలకు ఆదిలోనే చెక్ పెట్టడంలో బలగాలు సఫలం అయ్యాయి. గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ అటవీ తాలుకాలోని తడేగావ్ సమీపంలోని పార్లకోట నది వంతెన సమీపంలో మావోయిస్టులు మందుగుండు అమర్చారన్న సమాచారం అందుకున్న జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. టార్గెట్లను మట్టుబెట్టేందుకు ఏర్పాటు చేశారన్న విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం మందుపాతరలను గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. జిల్లా కేంద్రమైన గడ్చిరోలి నుండి ప్రత్యేకంగా హెలిక్యాప్టర్ లో బాంబ్ డిఫ్యూజ్ స్క్వాడ్స్ (BDDS)ను పంపించిన జిల్లా పోలీసు అధికారులు వాటిని నిర్వీర్యం చేయించారు. CRPF, BSF బలగాలు కూడా తడేగావ్ పార్లకోట నది వంతెన సమీపంలో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఓ చోట అమర్చిన మందుపాతర పేలినప్పటికీ బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. మరో చోట అమర్చిన మందుపాతరను గుర్తించిన BDDS బృందం నియంత్రిత పద్దతి ద్వారా నిర్వీర్యం చేసింది. అయితే ఈ ప్రాంతంలో మరిన్ని చోట్ల కూడా మందుపాతరలు అమర్చి ఉంటారని భావిస్తున్న బలగాలరు భామ్రాఘడ్ తాలుకా అటవీ ప్రాంతంలో వాటిని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. దండకారణ్య అటవీ ప్రాంతానికి చెందిన మావోయిస్టు పార్టీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మందుపాతరలను అమర్చి ఉంటారని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు సాఫిగా జరిగే విధంగా బలగాలను అటవీ ప్రాంతంలో మోహరించి కూంబింగ్ ఆపరేషన్లు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.