పీడీఎస్ రైస్ కోసం దాడులు… అవాక్కయిన పోలీసులు

దిశ దశ, నిజామాబాద్:

రేషన్ బియ్యం అక్రమంగా తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న ఓ డెన్ పై దాడి చేసిన పోలీసులు ఒక్క సారిగా షాకయ్యారు. అప్పటి వరకు కేవలం రేషన్ బియ్యాన్ని మాత్రమే పక్కదారి పట్టించే మాఫియా అనుకున్న పోలీసులు రైడ్స్ చేసిన తరువాత ఓ గోదాంలో లభ్యమైన ఆ సామాగ్రి కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. నిజామాబాద్ పోలీసులు మంగళవారం దాడులు చేసిన దాడుల్లో వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై అటు పోలీసు వర్గాల్లో ఇటు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని నిజాం కాలనీలోని ఓ పీడీఎస్ రైస్ గోదాంపై పోలీసులు ముప్పేట దాడి చేశారు. ఈ గోదాం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. అయితే గోడౌన్ లో సోదాలు చేస్తున్న క్రమంలో కత్తులు, తల్వార్లు, తుపాకి కూడా పోలీసులకు దొరకడంతో పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. రేషన్ బియ్యం మాఫియా వద్ద ఆయుధాలు కల్గి ఉండడం ఏంటన్న కోణంలో పోలీసులు ఆరా తీయడం మొదలు పెట్టారు. గోదాం నిర్వహకుడిని అదుపులోకి తీసుకున్న నిజామాబాద్ పోలీసులు అతన్ని పూర్తి స్థాయిలో విచారించే పనిలో నిమగ్నం అయ్యారు. అక్రమంగా ఆయుధాలు సేకరించుకున్నారని భావిస్తున్న పోలీసులు అవి ఎక్కడి నుండి తీసుకొచ్చారు. ఎందు కోసం తెచ్చుకున్నారు తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. తుపాకి, తల్వార్లు, కత్తులతో ఏమైనా దాడులకు పాల్పడ్డారా లేక బెదిరింపులకు గురి చేశారా అన్న వివరాలు కూడా తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఆయుధాల వెనక ఉన్న నెట్ వర్క్ పై కూడా ప్రత్యేకంగా తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్టు సమాచారం.

You cannot copy content of this page