పోలీసుల దాడులతో వెలుగులోకి
దిశ దశ, చెన్నూరు:
అర్థరాత్రి ఊరికి దూరంగా గోదావరి తీరంలో అడ్డా పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుందునుకున్న ఆ పేకాట కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేసేశారు. తెల్లవారు జామున అందిన సమాచారం మేరకు దాడులు చేసి పోలీసులు దర్జాగా సాగుతున్న పేకాట స్థావరం నుండి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ సమీపంలోని గోదావరి తీరంలో పేకాట అడుతున్నారన్న సమాచారం అందుకుని గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో దాడులు చేశారు. గోదావరి ఒడ్డున సాగుతున్న ఈ కేంద్రంలో గోదావరిఖని, ఏన్టీపీసీ , రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి, కోరుట్ల మరియు మెట్ పల్లి ప్రాంతాలకు చెందిన 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట రాయుళ్ల నుండి రూ. 2.51 లక్షల నగదు, 12 కార్లు, 43 సెల్ ఫోన్లు, రెండు ఛార్జింగ్ లైట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెన్నూరు టౌన్ సీఐ వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నింటిని సిద్దం చేసుకుని…
గురువారం తెల్లవారు జామున చెన్నూరు గోదావరి తీరంలో పేకాట కేంద్రంపై పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులను గమనిస్తే నిర్వహాకులు పకడ్భందీ వ్యూహంతోనే ఉన్నారని స్పష్టమవుతోంది. ఛార్జింగ్ లైట్లు కూడా సమకూర్చుకున్నారంటే పేకాట రాయుళ్లు జాగ్రత్తలు ఎంతమేర తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సుదూర ప్రాంతాలైన జగిత్యాల కోరుట్ల నుండి కూడా ఇక్కడికి జూదగాళ్లు వచ్చారంటే నిర్వహాకులు నెట్ వర్క్ విస్తరించుకున్న తీరు స్పష్టం అవుతోంది. కార్లలో వచ్చి మరీ అందర్ బాహర్ గేమ్ ఆడుతుండడం గమనార్హం. అయితే గతంలో చెన్నూరు మీదుగా పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతంలో క్లబ్ ల నిర్వహణ జరగడం, వాటిని గడ్చిరోలి పోలీసు అధికారులు మూయించడంతో పేకాట రాయుళ్ల కోసం చెన్నూరు గోదావరి తీరం కేంద్రంగా అడ్డా క్రియేట్ చేసి ఉంటారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా చెన్నూరు పోలీసుల దాడులతో జూదగాళ్లు ఏర్పర్చుకున్న కొత్త డెన్ వెలుగులోకి వచ్చినట్టయింది.