నందెల్లి మహిపాల్ అనుచరుడిపై కేసు
దిశ దశ, కరీంనగర్:
అన్న వస్తాడు… రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రబుద్దుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరించినందుకు బీఆర్ఎస్ పార్టీ నేత, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి నందెల్లి మహిపాల్ అనుచరుడిపై ఈ కేసు నమోదు అయింది. కరీంనగర్ టూ టౌన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఓ వెంకటేష్ తెలిపారు. నందెల్లి మహిపాల్ అన్న యువసేన పేరిట ఉన్న వాట్సప్ గ్రూపులో కొత్తపల్లి మండలం బద్దిపల్లికి తాండ్ర సతీష్ ఇటీవల ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఈ గ్రూపులో నందెల్లి మహిపాల్ అరెస్టును ఉద్దేశించి ఎవరు కూడా బాధపడవద్దు 14 రోజుల రిమాండ్ తర్వాత మళ్లీ అన్న బయటకు వస్తాడు కదా, మహా మహా నాయకులు జైలు లో ఉండి తమ కార్యకలాపాలు చేశారు మన తెలుగు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జైలు జీవితం గడిపారు. దానిని భూతద్దంలో చూడాల్సిన పని లేదు అన్న మళ్లీ బయటకు వస్తాడు ఎవరికి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్టులు వారికి ఇచ్చేస్తాడు ఎవరు కూడా అధైర్య పడవద్దు, సహనంతో ఉండండి. జయహో మహిపాల్ అన్న అన్న వాఖ్యలను షేర్ చేశాడు. ఇతరులను రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా తాండ్ర సతీష్ షేర్ చేసిన ఈ పోస్టుపై ఐపీసీ సెక్షన్ 153, 505 (2), 506 సెక్షన్లలో కేసు నమోదు చేశామని సీఐ వివరించారు. ఏదైనీ సోషల్ మీడియా వేదికల్లో ఉద్రేకపూరితమైన పోస్టులు షేర్ చేసి, శాంతి భధ్రతలకు భంగం కల్గించే విధంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కరీంనగర్ టూ టౌన్ సీఐ స్పష్టం చేశారు.