స్టింగ్ ఆపరేషన్ అక్కడి నుండేనా..?

సర్వర్ల కోసం వేట… ఐ న్యూస్ ఎండీ ఇంట్లో సోదాలు…

దిశ దశ, హైదరాబాద్:

అక్రమార్కులు.. అవినీతిపరుల భాగోతం బట్టబయలు చేసేందుకు స్టింగ్ ఆఫరేషన్లు నిర్వహించాల్సిన మీడియా సంస్థ కేంద్రీకృతంగా స్పెషల్ ఆపరేషన్ సాగిందా..? చట్ట వ్యతిరేకంగా వ్యవహరమైన ఫోన్ ట్యాపింగ్ లో ఆ సంస్థ కూడా తన వంతు భాగస్వామ్యాన్ని అందించిందా..? అసలు ప్రణిత్ రావు ఇచ్చిన వాంగ్మూంల ఏంటీ..? ఏకంగా ఓ మీడియా సంస్థ ఎండీ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం ఏంటీ..? పోన్ ట్యాపింగ్, సాక్ష్యాల తారుమారు కేసులో కస్టడీలో ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ దుగ్యాల ప్రణిత్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. రెండు మూడు రోజుల క్రితమే మీడియా సంస్థల సహకారం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉందన్న ప్రచారం జరిగింది. అయితే ఆ దిశగా పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అదంతా వట్టి ప్రచారమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో నివాసం ఉంటున్న ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నట్టుగా బావిస్తున్న పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేసి పలు ఆధారాల కోసం అన్వేషన కొనసాగించినట్టుగా సమాచారం.

సెంట్రల్ ఆఫీసుకు లింకా..?

ఎస్ఐబీ స్సెషల్ ఆపరేషన్ టీమ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న లాగర్ రూమ్ కు ఐ న్యూస్ ఆఫీసుకు లింక్ ఉన్నట్టుగా ప్రణిత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా సమాచారం. పొలిటికల్ లీడర్స్, వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోసం ఓ సర్వర్ ను మీడియా సంస్థలో, మరో సర్వర్ ను సిరిసిల్లలో ఏర్పాటు చేసినట్టుగా ప్రణిత్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఒక సర్వర్ ఆచూకి కోసం శుక్రవారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆపరేషన్ నిర్వహించిన టీమ్ సర్వర్ ను ఐ న్యూస్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఎస్ఓటీ వింగ్ స్పెషల్ గా సర్వర్ రూం ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ వ్యవహారాలను చక్కబెట్టిందని పోలీసులు భావిస్తున్నారు. సర్వర్ తో పాటు ఇందుకు సంబంధించిన ఇతరాత్రా ఆధారాలు స్వాధీనం చేసుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. ఇందులో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. శ్రవణ్ రావు లండన్ వెల్లిపోయినట్టుగా పోలీసులు విచారణలో తేలింది.

అలా ఎలా..?

ఎస్ఓటీ టీమ్ ఓ మీడియా సంస్థలో సర్వర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడానికి అసలు కారణాలేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఈ ఆపరేషన్ గురించి బయటకు పొక్కకుండా ఉండాలని ముదుగానే జాగ్రత్త పడి సర్వర్ ను ఇక్కడ ఏర్పాటు చేశారా..? ఎస్ఐబీలో అయితే బయటకు లీక్ అవుతుందని అనుమానించారా..? లేక ఇంకా వేరే బలమైన కారణాలు ఉన్నాయా అన్న చర్చ మొదలైంది. గతంలో ఇతరుల చేతుల్లో ఉన్న ఐ న్యూస్ చానెల్ ను శ్రవణ్ రావు తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయా..? అన్న కోణంలో కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర మీడియా సంస్థలు కూడా అనుకూలంగా వ్యవహరించిన ఆ సమయంలో ప్రత్యేకంగా ఐ న్యూస్ ఛానెల్ ను ఎందుకు ఎంచుకున్నారు..? అక్కడే సర్వర్ రూం స్పెషల్ గా ఏర్పాటు చేసుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నది మిస్టరీగా మారింది. మీడియా సంస్థలో సర్వర్ల వినియోగం సాధారణంగా ఉంటుందన్న కారణమేనా లేక… సేఫ్ జోన్ గా ఉంటుందని భావించారా..? అసలు సర్వర్ అక్కడ ఏర్పాటు చేయాలని ప్రణిత్ రావు టీమ్ కు సూచించింది ఎవరూ..? శ్రవణ్ కుమార్ రావుతో బడా బాబులకు ఉన్న సాన్నిహిత్యమే కారణమా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

రహస్యానికి పాతరేశారా..?

గుట్టుగా వ్యవహరించాల్సిన ఎస్ఐబీ ఆపరేషన్ల విషయంలో సీక్రసీ అన్న పదానికే పాతరేసినట్టుగా ఈ వ్యవహారంతో తేటతెల్లమవుతోంది. ఎస్ఐబీ కార్యాలయంలో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తుంటారు. ఇందులో ఎస్ఐబీ వింగ్ లో డ్యూటీలు చేయని పోలీసు అధికారులు వెళ్లినా క్షుణ్ణంగా పరిశీలించి అపాయింట్ మెంట్ కన్ ఫం అయిన తరువాతే లోపలకు పంపిస్తారు. ఇందులో పనిచేసే పోలీసు అధికారులు అత్యంత విశ్వసనీయంగా ఉన్న వారిని కలిసేందుకే ప్రయారిటీ ఇస్తుంటారు. బయట నుండి వచ్చే వారికి తాము ఏ ఆపరేషన్ లో ఉన్నామో అన్న విషయాన్ని కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతుంటారు. అటువంటి స్పెషల్ ఇంటలీ జెన్స్ వింగ్ ఆపరేషన్ కు సంబంధించిన సర్వర్లు బయట ఏలా ఏర్పాటు చేశారు..? విశ్వసనీయతతో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా ఏర్పాటు చేశారన్నదే మిస్టరీగా మారింది.

You cannot copy content of this page