పెద్దపల్లి జిల్లాలో విచిత్ర రాజకీయాలు
దిశ దశ, పెద్దపల్లి:
ఒకే ఒక కుర్చీ చుట్టే ఆ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాము గెలిచేందుకు ఆ సీటునే ఎరగా వేస్తున్నారు అక్కడి నాయకులు. దీంతో ఆ రెండు సెగ్మెంట్లలో కూడా ఆ కుర్చీ చుట్టే రాజకీయం అల్లుకపోయిందన్న చర్చ మొదలైంది.
ఏ జిల్లా… ఏమా కథ…?
పెద్దపల్లి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల గెలుపునకు ఆటంకం ఉండకూడదని భావించిన అభ్యర్థులు వివిధ అసమ్మతి నాయకులను అస్మదీయులుగా మార్చుకునేందుకు వేస్తున్న ఎత్తులు అన్నిఇన్ని కావు. ఇందుకోసం ఆ జిల్లాలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ కుర్చీ. ఈ కుర్చీ మీకేనంటూ హామీ ఇస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ప్రస్తుతం మంథని నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన స్థానంలో మరోకరికి అవకాశం ఇస్తామంటూ ఇప్పుడే బెర్త్ కన్ఫం చేసే పనిలో నిమగ్నం అయ్యారట ఆ రెండు నియోజకవర్గాల నాయకులు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఏడాది కాలం పాటు ఆ పదవిలో కొనసాగించవచ్చంటూ అక్కడి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్తున్నారట.
ఎంతమందికో మరి..?
అయితే పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు మాత్రం ఇప్పటికే ముగ్గురు జడ్పీటీసీ సభ్యులకు ఆఫర్ కూడా ఇచ్చేశారట. అయితే ఉద్యమ పార్టీలో ఉన్నా తనకు నామమాత్రపు పోస్టులతోనే సరిపెట్టారని, ఏడాది కాలం పాటు ఉండే ఆ కుర్చీ ఎవరికి కావాలంటూ ఓ జడ్పీటీసీ గులాభి పార్టీకి బైబై చెప్పేసి మరో పార్టీలో చేరిపోయారు. తాజాగా మరో ఇద్దరు జడ్పీటీసీ సభ్యులకు మాత్రం ఆ కుర్చీనే చూపించి తమ గెలుపునకు సహకరించాలని కోరుతున్నారట. ఇటీవల వేరే పార్టీకి రాజీనామా చేసిన ఓ జడ్పీటీసీకి కూడా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు అక్కడి ముఖ్యనాయకులు మంత్రాగం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపున అధికార పార్టీకి చెందిన మరో జడ్పీటీసీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడడంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ తన సన్నిహితులతో చెప్పడంతో ఆయన్ను బుజ్జగించేందుకు కూడా పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ కుర్చీనే ఎరగా చూపించారట. దీంతో ఒక కుర్చీలో ఎంతమందిని కూర్చోబెడ్తారన్న చర్చ కూడా మొదలు కాగా, ప్రస్తుతానికి తమ ఎన్నికలు గట్టెక్కితే చాలు ఆ తరువాత ఆలోచిద్దామన్న రీతిలోనే వ్యవహరిస్తున్నారేమోనని కూడా ఆ జిల్లాలో మాట్లాడుకుంటున్నారట. దీంతో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు ఓటములు ఆ జడ్పీ ఛైర్మన్ కుర్చీ చుట్టే తిరుగుతున్నాయన్న వాదనలు మొదలయ్యాయి.