హమ్మయ్య ఓ గండం గట్టెక్కింది…

అసెంబ్లీ ఎన్నికల తరువాతే సింగరేణి ఎన్నికలు

హైకోర్టు ఆదేశాలతో ఊపిరి పీల్చుకున్న పార్టీలు

దిశ దశ, రామగుండం:

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు మరో సారి వాయిదా పడ్డాయి. హై కోర్టు సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వివిధ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్నికలు జరిగినట్టయితే అసెంబ్లీకి గెలిచే అభ్యర్థుల తలరాతలు మారిపోయే ప్రమాదం ఉండేది. హైకోర్టు నిర్ణయంతో ఓ గండం గట్టెక్కామని ఆయా పార్టీలు సంబరపడిపోతున్నాయి.

ఆరు జిల్లాల్లో…

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. 43 వేలకు పైగా కార్మికులు ఉన్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నదే ప్రధాన అంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర కార్మిక శాఖ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సమాయత్తం అయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగినట్టయితే వాటి ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని ఆయా రాజకీయా పార్టీలు భావించాయి. సింగరేణి కార్మికలోకం ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల వేళ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించినట్టయితే వాటి ఫలితాలతో తమ తలరాతలు మారిపోతాయని ఆయా పార్టీలు అంచానా వేసుకున్నాయి. అనూహ్యంగా హై కోర్టు డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరపాలని ఆదేశించడంతో సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా సైలెంట్ అయిపోయిందని చెప్పకతప్పదు. సింగరేణి విస్తరించిన ప్రాంతాలకే కాకుండా ఈ ఫలితాల ప్రభావం ఇరుగు పొరుగు నియోజకవర్గాలతో పాటు, రిటైర్డ్ కార్మికులు స్థిరపడిపోయిన ప్రాంతాల్లో కూడా పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో సింగరేణి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగకుంటేనే మంచిదన్న అభిప్రాయంతో రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రధానంగా సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో మాత్రం ఎన్నికలు వాయిదా పడితే బాగుండని అనుకున్న వారే ఎక్కువ అని చెప్పాలి. అంతే కాకుండా రెండు ఎన్నికలకు సంబంధించిన భారం కూడా తమపై పడుతుందన్న అభిప్రాయం కూడా వివిధ పార్టీల నేతల్లో వ్యక్తం అయింది. ఏకకాలంలో రెండు ఎన్నికలకు సంబంధించిన మెయింటనెన్స్ చేయాలంటే తడిసిమోపెడు అవుతుందన్న ఆందోళన కూడా వ్యక్తం అయింది. కానీ హై కోర్టు ఇచ్చిన తాజా నిర్ణయంతో అన్ని పార్టీల నాయకులు కూడా ఆనందంలో మునిగిపోయారు.

You cannot copy content of this page