నాడు ఆరోపణలు… నేడు పోటీలు…

పెద్దపల్లి జిల్లాలో ఇసుక రీచుల పోరాటం తీరు

రెండు పొలిటికల్ పార్టీల నాయకుల పోరు…

దిశ దశ, కరీంనగర్:

నిన్న మొన్నటి వరకు ఇసుక మాఫియా నుండి డబ్బులు నువ్వు తీసుకున్నావంటే నువ్వు తీసుకున్నావని ఆరోపణలు చేసుకున్న పొలిటికల్ పార్టీల నాయకులు ఆ తరువాత ఈ అంశాన్ని పక్కనపెట్టి ఇప్పుడు న్యాయ పోరాటం చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 8 రీచులపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో పెద్దపల్లి విషయంలో కూడా అదే ఎత్తుగడతో ముందుకు సాగి తమ వల్లే రీచులు మూసివేశారన్న పేరు తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో పొలిటికల్ పార్టీల నాయకులు తలమునకలువుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఓదెల మల్లన్న గుడి వరకూ…

పెద్దపల్లి జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నది నుండి ఇసుక తరలించేందుకు టీఎస్ఎండీఎసీ టెండర్ల ద్వారా కాంట్రక్ట్ అప్పగించింది. పలు రీచుల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్న క్రమంలో మానేరు నది విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు రీచులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకరావడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించారు. చెక్ డ్యాంల నిర్మాణం జరపకముందే డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక తవ్వకాలు జరుపుతున్నారన్న విషయాన్ని గమనించారు. అంతేకాకుండా పర్యావరణ చట్టలకు అనుగుణంగా డిసిల్ట్రేషన్ జరగడం లేదని, పూడిక తీత కోసం తీసే ఇసుక స్థానిక అవసరాలకు మాత్రమే వినియోగించాలి తప్ప కమర్షియల్ గా వ్యాఫారం చేయకూడదన్న నిభందనలు ఉన్నాయని గమనించారు. కమర్షియల్ అవసరాలకు అయితే పర్యవారణ అనుమతులు తప్పని సరి అన్న నిభందనను అనుసరించి ఎన్జీటీని ఆశ్రయించారు మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డిలు. ఇదే సమయంలో ఇసుక వ్యవహారంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంది. ఇసుక కాంట్రాక్టర్ల నుండి ముడుపులు తీసుకున్నారన్న అంశంపై పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమాణారావుల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. పెద్దపల్లి జెండా చౌరస్తా, ఓదెల మల్లన్న గుడి సాక్షిగా ప్రమాణాలు చేద్దామన్న సవాళ్లు కూడా విసురుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇసుక రీచుల విషయం గురించి మాట్లాడిన దాఖాలాలే లేవు. దాదాపు వారం రోజలు పాటు పెద్దపల్లి జిల్లాలో హడావుడి చేసిన రెండు పార్టీల నాయకులు ఆ తరువాత విస్మరించడం విస్మయానికి గురి చేసింది. అయితే మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు మాత్రం పట్టు వదలని విక్రమార్కుళ్లలా వ్యవహరిస్తూ పెద్దపల్లి జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలకు బ్రేకులు వేయించుకోవడంలో సఫలం అయ్యారు. ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలం అయ్యారంటూ ధిక్కరణ పిటిషన్ కూడా వేసేందుకు సమాయత్తం అయ్యారు. ఇదే క్రమంలో ఎన్జీటీ ఆదేశాలను అనుసరించి టీఎస్ఎండీసీ పెద్దపల్లి జిల్లాలోని ఇసుక రీచులను పొరుగునే ఉన్న కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల మీదుగా నడిపించే పనిలో నిమగ్నం అయింది. దీంతో కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల రీచులపై కూడా ఎన్జీటీలో పిటిషన్ వేయడంతో ఎన్జీటీ పర్యావరణ అనుమతులు లేనట్టయితే మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలో అయితే మైనింగ్ కార్యకలాపాలను నియంత్రించకపోతే ఇందుకు బాధ్యత కలెక్టర్ తీసుకోవల్సి వస్తుందని కూడా ఎన్జీటీ ఆదేశించింది. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఇసుక కాంట్రాక్టులు పొందిన వారు హై కోర్టును ఆశ్రయించి మానేరులో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎన్జీటీ ఉత్తర్వులను పక్కన పెట్టేసి మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హై కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో ఈ ఉత్తర్వులను కరీంనగర్ జిల్లా కలెక్టర్ రెండు రోజుల క్రితం నుండి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మానేరు నది పరివాహక ప్రాంతంలో ఇసుక రీచులను నిలిపివేయాలని స్పష్టం చేసి అదికారుల బృందాలను పంపించారు. దీంతో కరీంనగర్ జిల్లాలో ఒక్క సారిగా మైనింగ్ కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

రీ ఎంట్రీకి ప్రయత్నం…

కరీంనగర్ లో సుప్రీం కోర్టు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అమలు చేసిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా నాయకులు నెమ్మదిగా ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధుల నుండి కోర్టు ఉత్తర్వులు తీసుకుని సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాల ప్రతులను సేకరించి తమ పేరిట సుప్రీం కోర్టులో పోరాటం చేయాలని ఓ రెండు పార్టీల నాయకులు ఉవ్విళ్లూరుతున్నట్టుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషంలో జోక్యం చేసుకుని ఇసుక రీచులను క్లోజ్ చేయించిన ఘనత తమదేనని ప్రజలకు చెప్పుకోవాలన్న తపనతోనే ఈ వ్యవహారంలో తల దూర్చేందుకు యత్నిస్తున్నారన్న చర్చ మొదలైంది. ఇంతకాలం పొలిటికల్ గేమ్ గా వాడుకున్న ఇసుక రీచుల వ్వవహారంలో ఏనాడు న్యాయపరమైన పోరాటం వైపు కన్నెత్తి కూడా చూడని నాయకులు ఇప్పుడు మాత్రం పోటాపోటిగా సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతుండడం స్థానికంగా విమర్శలకు దారి తీస్తోంది. ఇసుక రీచుల వల్ల గ్రామాల్లో విధ్వంస్యం జరుగుతోందని, మానేరు నది అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినా మొక్కుబడి చర్యలతో సరిపెట్టిన నాయకులు ఇప్పుడు మాత్రం తమ పేరు నిలబడేందుకు పోటీలు పడుతుండడం విడ్డూరం. నెలల వ్యవధిలోనే ఎన్నికలు వస్తుండడంతో ఇదే సమయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆసరగా చేసుకుని పిటిషన్లు వేసినట్టయితే పెద్దపల్లి జిల్లాలో కూడా ఇసుక రీచుల కథ ముగిసిపోతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇసుక రీచులను నిలిపేసిన క్రెడిట్ తమకే దక్కుతుందని భావిస్తున్న నాయకులు అంతా అయ్యాక చివరి మెట్టు ఎక్కేందుకు రంగంలోకి దూకుతుండడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ రీచుల వ్యవహారంలో మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు, బీజేపీ నాయకుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మొదటి నుడి ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నారన్న విషయం మాత్రం ప్రజలు మర్చిపోయి, చివరి క్షణంలో ఎంట్రీ ఇచ్చిన నాయకులను నమ్ముతారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

You cannot copy content of this page