దిశ దిశ, జగిత్యాల:
ఒకే పార్టీలో ఉన్న ఆ ఇద్దరి మధ్య సయోధ్య లేకుండా పోయిందప్పుడు. ఒకరు ఎమ్మెల్యేగా… మరోకరు మునిసిపల్ ఛైర్ పర్సన్ గా ఉన్న క్రమంలో ఆధిపత్య పోరులు ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. చివరకు పార్టీ వీడి ప్రత్యర్థులుగా పోడి పడ్డారు. కానీ అనుకోకుండా మళ్లీ కలవాల్సి వచ్చిందిప్పుడు…
అసలేం జరిగిందంటే…
జగిత్యాల బీఆర్ఎస్ పార్టీలో గత సంవత్సరం అనూహ్యమైన పరిణామలు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణిల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. శ్రావణి మామ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇద్దరు కూడా ఒకప్పుడు సన్నిహితులు కావడం గమనార్హం. అయినప్పటికీ బోగ వెంకటేశ్వర్లు, డాక్టర్ సంజయ్ ల మధ్య విబేధాలు పొడసూపాయి. ఈ క్రమంలోనే శ్రావణి, సంజయ్ మధ్య కూడా అభిప్రాయబేధాలు నెలకొన్నాయి. దీంతో శ్రావణి తన పదవికి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే సంజయ్ పై ఆరోపణలు చేసి మరీ పార్టీని వీడారు. అనంతరం బీజేపీలో చేరిన శ్రావణి ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయిన వీరు ఇంతకాలం ఎడమొఖం పెడమొఖం అన్నట్టుగానే దూరం దూరంగా ఉండిపోయారు. కానీ సంక్రాంతి పండగ రోజును వీరిద్దరు ఒకే వేదికపై కనిపించాల్సి వచ్చింది. ధరూర్ క్యాంపులోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ రామ సేవా సమితి ఆద్వర్యంలో అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవము, పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్ర ఆశిష్కరణ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. కరపత్ర ఆవిష్కరణ పురస్కరించుకుని ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ బోగ శ్రావణిలు ఒకే వేదికపై కనిపించారు. ఇంతకాలం ఎవరికి వారే అన్నట్టుగా ఉన్న వీరిప్పుడు కోదండ రామాలయ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించాల్సి వచ్చింది. దీంతో రాజకీయాలు వీరిద్దరిని దూరం చేసిన దేవుని కార్య మాత్రం వీరిద్దరిని ఒకే చోట కనిపించేలా చేసిందంటూ పట్టణ వాసులు కామెంట్ చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం నాడు జగిత్యాల పట్టణంలో ఓ మంచి సన్నివేశం సాక్షాత్కరించిందని ఇరు పార్టీల నాయకులు వ్యాఖ్యానించడం విశేషం.