దిశ దశ, వరంగల్:
వరంగల్ లోకసభ ఎన్నికల్లో పోటీ ఒకే తాను ముక్కల మధ్య సాగనునుంది. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వారే కావడం విశేషం. బీజేపీ అభ్యర్థిగా అరూరి రమేష్, బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్యలు బరిలో నిలవనున్నారు. అయితే ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఉద్యమ పార్టీ నేఫథ్యం ఉన్నవారే కావడం విశేషం.
సీనియర్లతో పోటీ…
వరంగల్ లోకసభ ఎన్నికలతో తొలిసారి ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టిన కావ్య ఇద్దరు సీనియర్ నేతలతో తలపడుతున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా అనుభవం ఉన్న సుధీర్ కుమార్, ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న అరూరి రమేష్ లతో కడియం కావ్య తలపడబోతున్నారు. అరూరి రమేష్ కడియం శ్రీహరి శిష్యుడిగా ఎదగడంతో పాటు వర్దన్నపేట ఎమ్మెల్యే టికెట్ కోసమే గతంలో కావ్య ప్రయత్నించారన్న ప్రచారం కూడా సాగింది. అయితే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ రేసులో పోటీ పడిన రమేష్, కావ్యలు ఇద్దరు ఎంపీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు.
డాక్టర్ వర్సెస్ డాక్టర్…
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ఎంపీపీగా, జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. గతంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ప్రస్తుతం హన్మకొండ జిల్లాపరిషత్ ఛైర్మన్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఆయన తల్లి కిరిటమ్మ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి భీమదేవరపల్లి ప్రాంతంలో పేరొందారు. ప్రస్తుతం ఆయనతో పోటీ పడుతున్న కడియం కావ్య కూడా డాక్టర్ కావడం మరో విశేషం.
ఇరిగేషన్ లింకే…
వరంగల్ లోని ముగ్గురు అభ్యర్థుల నేపథ్యం కూడా అత్యంత విచిత్రంగానే అనుబంధం పెనవేసుకుంది. కడియం కావ్య తండ్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గతంలో ఇరిగేషన్ మంత్రిగా వ్యవహరించగా బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కావడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన మారేపల్లి సుధీర్ కుమార్ తండ్రి కూడా ఇరిగేషన్ విభాగంలో ఉద్యోగం చేసిన వారే కావడం విశేషం. కమలాపూర్ మండలం ఉప్పల్ కు చెందిన సుధీర్ కుమార్ తండ్రి ఉద్యోగ రిత్యా భీమదేవరపల్లికి వెల్లి అక్కడే స్థిరపడిపోయారు. కడియం శ్రీహరి, అరూరి రమేష్ లు టీడీపీ ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వగా, సుధీర్ కుమార్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా నిన్న మొన్నటి వరకు గులాభి జెండా నీడనే రాజకీయాలను నెరిపి ఇప్పుడు ప్రత్యర్థులుగా ప్రజాక్షేత్రంలోకి రావడం విశేషం.
కేసీఆర్ వ్యూహం…
మారేపల్లి సుధీర్ కుమార్ ఎంపీక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది. రాష్ట్రంలోని ఎస్సీ లోకసభ రిజర్వుడు స్థానాల్లో మాల సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని, మాదిగ సామాజిక వర్గ అభ్యర్థులకు అవకాశం కల్పించడం లేదన్న ఆరోపణలు కూడా తీవ్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ అభ్యర్థిత్వం ఖరారు చేసి ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టారు. మరో వైపున ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇచ్చినందు మాదిగలంతా కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలని మందకృష్ణ కూడా పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో తమ సామాజిక వర్గ అభ్యర్థులకు అవకాశం కల్పించలేదంటూ మంద కృష్ణ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించడం వెనక భారీ స్కెచ్ వేశారని స్ఫష్టం అవుతోంది.