ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ… అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల పరంపర

దిశ దశ, జగిత్యాల:

ఆ రాజకీయ ప్రత్యర్థులిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలైందా..? నిన్న మొన్నటి వరకు ఆరోపణలు చేసుకున్న ఆ ఇద్దరు నేతలు ఇక ఫిర్యాదులు చేసుకోవడం మొదలు పెట్టారా..? ఇద్దరి మధ్య నెలకొన్న వైరుధ్యం కాస్తా అక్రమ నిర్మాణాల బాగోతాన్ని వెలుగులోకి తీసుకవస్తోందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది వారిద్దరి తీరును గమనిస్తే. చైతన్యానికి మారుపేరుగా నిలిచే ఆ జిల్లా కేంద్రంలో నెలకొన్న నయా పాలిటిక్స్ తీరును గమనిస్తే…

నిన్న ఎమ్మెల్సీ…

శాసనమండలి సభ్యుడు, సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాకు లేఖ రాశారు. పట్టణంలోని 4వ వార్డులో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, నిబంధనల మేరకే నిర్మిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆరా తీసి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. బైపాస్ రోడ్డులోని దేవిశ్రీ గార్డెన్స్ సమీపంలో టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు అనుమతులు తీసుకుని జరుపుతున్నారా లేక పర్మిషన్ తీసుకున్నప్పటికీ అందుకు అనుగుణంగానే నిర్మిస్తున్నారా లేదా అన్న విషయంపై విచారణ జరపాలని కోరారు. అక్రమంగా జరుగుతున్న నిర్మాణాల విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించిన జీవన్ రెడ్డి బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

నేడు ఎమ్మెల్యే…

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నచ్చితే సక్రమం… నచ్చకపోతే అక్రమం అన్నట్టుగా వ్యవహరిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దుయ్యబట్టారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని లేఖ రాసిన ఆయన శుక్రవారం కలెక్టర్ యాస్మిన్ భాషాకు వినతి పత్రం అందజేశారు. నుమతులు పొందకూడా నిర్మించడంతో పాటు అనుమతులు ఉన్నా అందుకు విరుద్దంగా నిర్మించినవి, జోన్లకు విరుద్దంగా అనుమతులు ఇచ్చినవి, 7వ వార్డులో అనుమతులు లేకుండా నిర్మించిన ఇండ్లకు ఇంటి నంబర్లు ఎలా ఇచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నివాసాల కోసం అనుమతి తీసుకుని వాణిజ్య సముదాయాలుగా మార్చారని, సెట్ బ్యాక్ లేకుండా, 30 ఫీట్ల రోడ్లకు స్థలం వదిలివేయకుండా నిర్మించిన వాటిపై కూడా విచారించాలన్నారు. విలీన గ్రామాల్లో పంచాయితీల నుండి అనుమతులు తీసుకుని ఇండ్ల నిర్మాణం జరిపిన విషయంపై కూడా ఆరా తీయాలని అభ్యర్థించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి పట్టణానికి మాస్టర్ ప్లాన్ లేకుండా చేశారని డాక్టర్ సంజయ్ మండిపడ్డారు.

గుట్టు రట్టు…

అయితే జగిత్యాలలో తాజాగా నెలకొన్న ఫిర్యాదుల పరంపర కారణంగా మునిసిపాలిటీ యంత్రాంగం వ్యవహరించిన తీరు బట్టబయలు అవుతోంది. సాక్షాత్తు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలే అక్రమ నిర్మాణాలపై పిర్యాదులు చేయడంతో పట్టణం జరిగిన ఇండ్ల నిర్మాణాల్లో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నాన్ కమర్షియల్ పర్మిషన్లు తీసుకుని కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చుకున్న విషయంతో పాటు అసలు బల్దియాకు దరకాస్తు చేసుకోకుండానే ఇండ్ల నిర్మాణం చేపట్టారన్న విషయం కూడా అధికారుల దృష్టికి వచ్చింది. అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేసిన ఫిర్యాదుల తీరుతో జగిత్యాల మునిసిపల్ పరిధిలో చోటు చేసుకున్న తతంగం అంతా బాహ్యప్రపంచానికి తెలిసినట్టయింది. ఏది ఏమైనా రాజకీయ నాయకులు తమ వారిని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో లోపాయికారి ఒప్పందాలతో ముందుకు సాగుతారన్న అభిప్రాయాలు ఉండేవి. కానీ జగిత్యాలలో మాత్రం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఫిర్యాదులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.

You cannot copy content of this page