దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల మునిసిపల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇటీవల కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాణం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో కౌన్సిలర్ల అభ్యర్థనను అనుసరించి జిల్లా కలెక్టర్ అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ఫిబ్రవరి 14న 11 గంటలకు అవిశ్వాస తీర్మాణం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
కొండ నాలుక్కి మందేస్తే…
జగిత్యాల బల్దియా ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తించిన బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత ఇంఛార్జిగా వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ కు ఇంఛార్జి బాద్యతలు ఇచ్చారు. అయితే ఈ నెల 10 శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను తప్పించాలని అభ్యర్థించారు. తనను ఇంఛార్జి ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించి ఏడాది కావస్తోందని, మునిసిపల్ చైర్ పర్స్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించాలని ఆయన కోరారు. మునిసిపల్ వైస్ ఛైర్మన్ గా తనను యథావిధిగా కొనసాగించాలని కూడా ఆయన కోరారు. తనకు అప్పగించిన ఇంఛార్జి ఛైర్మన్ బాద్యతల విషయంలో ఇటీవల పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరిగినప్పుడు శ్రీనివాస్ నుండి బాధ్యతలు తప్పించే విధంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల మునిసిపల్ కౌన్సిలర్లు ఇంఛార్జి ఛైర్మన్ గా ఉన్న గోలి శ్రీనివాస్ పై అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెడతామని, ఆయనను ఇంఛార్జి బాధ్యతలను తొలగించి ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నికలు జరపాలని అభ్యర్థించారు. 29 మంది కౌన్సిలర్లు చేసుకున్న దరఖాస్తు మేరకు వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ పై అవిశ్వాస తీర్మాణం కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో శ్రీనివాస్ తన పదవి కాలం పూర్తయ్యే వరకూ వైస్ ఛైర్మన్ గా కొనసాగాలన్న అంచనాలు కూడా తలకిందులు అయినట్టుగా స్పష్టం అవుతోంది. కౌన్సిలర్లు కూడా తమ అవిశ్వాస నోటీసులో పట్టణాభివృద్ది కుంటు పడుతున్నందున ఇంఛార్జి ఛైర్మన్ ను తొలగిస్తూ, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరపాలని అభ్యర్థించడం గమనార్హం.
ఎమ్మెల్యేకు కొత్త తలనొప్పి…
సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు అవిశ్వాస సమావేశం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మునిసిపల్ ఛైర్ పర్సన్ పదవికి ముగ్గురి నుండి నలుగురు పోటీ పడుతుండగా, కొత్తగా వైస్ ఛైర్మన్ అవిశ్వాసం కూడా తెరపైకి రావడంతో రెండు పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారిందనే చెప్పాలి. బోగ శ్రావణిని పదవి నుండి తొలగించాలని భావించిన కౌన్సిలర్లు కూడా ఎవరికి వారే అన్నట్టుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొన్నారు. కొంతమంది నేరుగా వెల్లి ఎమ్మెల్యే సంజయ్ తో మంతనాలు జరిపారు. శ్రావణికి వ్యతిరేకంగా సమీకరణాలు నెరుపుతున్న నేపథ్యంలో ఆమె కూడా ఎమ్మెల్యే సంజయ్ పై ఆరోపణలు చేస్తూ రాజీనామా చేశారు. ఆమె రాజీనామ తరువాత ఛైర్ పర్సన్ పదవిపై పోటీ తీవ్రంగా ఉండడంతో ఇంఛార్జి బాధ్యతలు అప్పగించి కాలం వెల్లదీశారు. కానీ ఇప్పుడు 29 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం కోసం నోటీసు ఇవ్వడం, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో అభ్యర్థులుగా ప్రకటించే విషయంలో సమీకరణాలు నెరపాల్పిన పరిస్థితి ఏర్పడింది. మెజార్టీ ఉన్నప్పటికీ పార్టీ కౌన్సిలర్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరిని బుజ్జగించాలి, ఎవరికి పదవులు కట్టబెట్టాలి అన్న విషయం తేల్చుకోవడంపై ఎమ్మెల్యే సంజయ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మల్లగుల్లాలు పడాల్సి రానుందా అన్న చర్చ మొదలైంది. ఈ ఎన్నిక ప్రక్రియతో జగిత్యాల పట్టణంలో పార్టీ అసమ్మతి భగ్గుమనే పరిస్థితి లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ ఈ ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారన్నదే ఆసక్తికరంగా మారింది.