దిశ దశ, హుజురాబాద్:
నిబంధనలకు విరుద్దంగా రవాణా అవుతున్న బూడిద పంచాయితీ కాస్తా దేవుని వద్దకు చేర్చేలా చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య జరుగుతున్న యాష్ సప్లై వ్యవహారం రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వందల కోట్ల స్కాం అంటూ ఆయన ఏకంగా బూడిద రవాణా చేసే లారీలను అడ్డుకుని ఆరోపణలకు దిగారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నమస్తే తెలంగాణాతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మీడియా ముందు సవాల్ విసిరారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని జూబ్లీ హిల్స్ వెంకటవేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తావా అని ప్రశ్నించారు. మంత్రి పొన్నంపై ప్రభాకర్ పై కౌశిక్ రెడ్డి విసిరిన ఈ సవాల్ పై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ కౌంటర్ అటాక్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన ప్రణవ్ చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని ప్రతి సవాల్ విసిరారు. మంగళవారం చెల్పూర్ అంజన్న సన్నిధికి రావాలని ప్రణవ్ విసిరిన ఈ సవాలును స్వీకరించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెల్పూరుకు వచ్చేందుకు సిద్దమయ్యారు.
రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు…
మరికొన్ని గంటల్లో చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రమాణాలకు సిద్దమవుతున్న క్రమంలో ఆలయ సమీపంలోని రహదారిపై ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ కాల్పుల అంశాన్ని ఈ ఫ్లెక్సీల ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున కరీంనగర్ లో జరిగిన లాఠీ ఛార్జి ఘటనకు సంబంధించిన ఫోటోలను వేసి కౌశిక్ రెడ్డి నోటి దూల ఫలితమంటూ ముద్రించారు. తెల్లవారే సరికి హుజురాబాద్, జమ్మికుంట రహదారిపై వెలిసిన ఈ ఫ్లెక్సీలు సంచలనం కల్గిస్తున్నాయి.
పోలీసుల స్వీట్ వార్నింగ్..?
మరో వైపున పోలీసులు కూడా రాత్రికే రాత్రే తమ వ్యూహాన్ని మార్చేశారు. అంజనేయ స్వామి ఆలయం వద్దకు ఇరు పార్టీల నాయకులు చేరుకుని ఉద్రిక్తత నెలకొనే వరకు వేచి చూడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇరు పార్టీల నాయకుల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నాయకులు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకపోతుందని కూడా హెచ్చరించినట్టుగా సమాచారం. ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించకుండా అంజన్న ఆలయం వద్దకు వెల్లే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టడంలో వెనకాడేది లేదని స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఏది ఏమైనా రామగుండం ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ నుండి ఖమ్మం జిల్లా మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు తరలి వెల్తున్న బూడిద అవినీతి చుట్టే రాజకీయం చేస్తున్న ఇరు పార్టీల నాయకులు ఆ ఊబిలో చిక్కుకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.