ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది గత కొంతకాలంగా హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఆయన.. బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ ఏమైందో ఏమో కానీ ఆ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానాలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన అంతగా ఆసక్తి చూపలేదు. అయితే వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో ఆయన ఇటీవల భేటీ అయ్యారు.
ఈ క్రమంలో పొంగులేటి వైఎస్సార్‌టీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. త్వరలో పాలేరు సమీపంలో వైఎస్ షర్మిల పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభలో షర్మిల ఆధ్వరంలో వైఎస్సార్‌టీపీ కండువా కప్పుకోనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై వైఎస్ విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. పొంగులేటి తనను కలిసి వైఎస్సార్‌టీపీలో చేరుతానని చెప్పినట్లు ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పొంగులేటి తన కొడుకుతో సమానమని, తన భార్యతో కలిసి వచ్చిన వైఎస్సార్‌టీపీలో చేరుతానని మాట ఇచ్చాడని విజయమ్మ చెప్పారు.
షర్మిలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటలను పొంగులేటి నిలబెట్టుకుంటారని అనుకుంటున్నట్లు చెప్పారు. పొంగులేటి తమ కుటుంబంలో ఒక సభ్యుడని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో షర్మిల పార్టీ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందని తాను అనుకోలేదని, కొన్ని కారణాల వల్ల పెట్టాల్సి వచ్చిందని విజయమ్మ తెలిపారు. తెలంగాణలో పార్టీ పెడతానని షర్మిల చెప్పినప్పుడు కష్టంగా అనిపించిందని విజయమ్మ తెలిపారు.
అయితే పొంగులేటి మాత్రం తాను వైఎస్సార్‌టీపీలో చేరుతాననే ప్రచారాన్ని ఖండిస్తున్నారు. విజయమ్మను కలిసిన మాట వాస్తవమేనని, తన కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు కలిశానని అన్నారు. వైఎస్సార్‌టీపీలో చేరే విషయంపై ఎవరితోనూ చర్చలు జరపలేదని అన్నారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.