పొన్నం మంత్రాంగం సక్సెస్…

నో అన్న వారే ఎస్ అంటున్న వైనం

దిశ దశ, హుస్నాబాద్:

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంత్రాంగం ఎట్టకేలకు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. సొంత నియోజకవర్గాన్ని వదిలేసి హుస్నాబాద్ కు వలస పోవడం వెనక ఏదో కారణం ఉందంటూ ప్రచారం చేసిన వారే ఆయన వేస్తున్న ఎత్తులను గమనించి భేష్ అనే పరిస్థితికి చేరింది. మొదట్లో పొన్నం నిర్ణయాన్ని స్వాగతించని వారు కూడా ఇప్పుడు ఆయన హుస్నాబాద్ ను ఎంచుకోవడం సబబేనన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పట్టు బిగిస్తున్న తీరు…

హుస్నాబాద్ నుండి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న పొన్నం ప్రభాకర్ అక్కడే ఉంటూ ప్రచారం చేయడం ఆరంభించారు. ఈ క్రమంలో ఇక్కడి నుండి టికెట్ ఆశించిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వర్గం పొన్నం ప్రభాకర్ వర్గం వేర్వేరుగా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ నాయకుల ముందు కూడా ఇరు వర్గాలు తగవులాడుకున్నాయి. అయితే హుస్నాబాద్ అల్గిరెడ్డి ప్రవీణ్ కు ఇస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచేదన్న వాదనలు మొదట్లో వినిపించినప్పటికీ ఆ పరిస్థితిలో పూర్తి స్థాయి మార్పు వచ్చేసింది. అగ్రెసివ్ లీడర్ బ్రాండ్ పొందిన పొన్నం యాక్టివిటీని గమనించిన హుస్నాబాద్ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఆయన వెంట కలిసి నడిచేందుకు ముందుకు రావడం ఆరంభించారు. అధిష్టానం కూడా ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని తేలిపోవడంతో పొన్నంకు మరింత సానుకూలత వచ్చేసింది. ఈ క్రమంలో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో మంతనాలు జరిపిన పొన్నం ఆయన్ని తనకు అనుకూలంగా మల్చుకోవడంలో సఫలం అయ్యారు. దీంతో పొన్నంకు మరింత బలం చేకూరినట్టు కాగా సీపీఐ కూడా ఆయన గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి కూడా అండగా నిలుస్తుండడం కూడా ఆయనకు లాభించనుంది. ఒకప్పుడు ఎర్రజెండా పార్టీకి తిరుగులేని పట్టున్న ప్రాంతం కావడంతో సీపీఐ అభిమానులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటారు. దీంతో వీరంతా కూడా పొన్నం ప్రభాకర్ ప్రచారంలో భాగస్వాములు కానున్నారు. ప్రభాకర్ ఇక్కడ టికెట్ ఆశించినప్పుడు ఉన్న వ్యతిరేక పరిస్థితుల నుండి ఆయన ఇక్కడి నుండి పోటీ చేయడం సబబే అన్న పరిస్థితులకు తీసుకొచ్చుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సూత్రంతో కాంగ్రెస్ పార్టీలో అనుకూలమైన వాతావరణం తీసుకొచ్చుకున్న ప్రభాకర్ ఇప్పుడు ప్రత్యర్థిపై పై చేయిగా నిలవాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.

You cannot copy content of this page