సింగర్ వాణీ జయరామ్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు మరణించగా.. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. చెన్నైలోని తన స్వగృహంలో వాణీ జయరామ్ తుది శ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరామ్‌ జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ జయరామ్ ఐదో సంతానం.

వాణీ జయరామ్ ఎనిమిదో వయసులోనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. పదేళ్ల వయస్సులో మొదటిసారి ఆల్‌ ఇండియా రేడియాలో పాటలు ఆలపించారు. 1970లో ‘గుడ్డీ’ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా మారారు. మొదటి పాటకే తాన్‌సేన్‌తో పాటు మరో నాలుగు అవార్డులు అందుకున్నారు. ‘అభిమానవంతుడు’ సినిమా ద్వారా గాయనిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారు.

కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ చిత్రంలోని మానస సంచరరే గీతానికి రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’ లోని ‘ఆనతి నియ్యరా హరా’ పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్ జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. హిందూస్థానీ క్లాసికల్‌ సింగింగ్‌లో ప్రావీణ్యం పొందిన వాణీ జయరామ్‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజపురి, మరాఠీ, ఒరియా.. ఇలా 14 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడారు.

You cannot copy content of this page