రాష్ట్రంలో పోలింగ్ డ్యూటీల్లో పాల్గొనే అధికార యంత్రాంగాన్ని సంశయంలోకి నెట్టిస్తోంది ఓ అవకాశం. ఎన్నికల విధుల్లో ఉండే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ఓపెన్ గా జరిగే ప్రక్రియ కావడంతో తాము ఎవరి పక్షాన నిలిచామోనన్న విషయం తెలిసి పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భారత ఎన్నికల సంఘం రహస్య బ్యాలెట్ విదానాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఉద్యోగులు, అధికారుల విషయంలో మాత్రం ఓపెన్ ఓటింగ్ విధానం అవలంభిస్తుండడం వల్ల ఇబ్బందులు ఎదురుకాక తప్పదని అంటున్న వారూ లేకపోలేదు. భారత పౌరులుగా తమకున్న ఓటు హక్కు ద్వారా వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించే అధికారం ఉన్నప్పటికీ… కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేకంగా లెక్కించే విధానం అమలు చేస్తుండడంతో అసలు విషయం వెలుగులోకి రాకతప్పడం లేదు. అధికార యంత్రాంగంలో మెజార్టీ ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అన్న విషయాన్ని రాజకీయ పార్టీలు ఈజీగా గుర్తించే అవకాశం ఉంటోంది. దీనివల్ల తమ పట్ల ఉద్యోగులు, అధికారులు సానుకూలంగా లేరన్న విషయాన్ని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇట్టే పసిగట్టేస్తున్నాయి. దీంతో తమ నిర్ణయం ఇట్టే తెలిసిపోవడం వల్ల ఎన్నికల డ్యూటీల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల డ్యూటీలో పాల్గొనే అధికారయంత్రాంగం వేసే ఓట్లను లెక్కించే విధానంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నట్టయితే బావుంటుందని అంటున్నారు కొందరు. సాధారణంగా ఎన్నికల విధుల్లో 70 నుండి 80 శాతం వరకు విద్యాశాఖకు చెందిన వారు విధులు నిర్వర్తించే అవకాశాలు ఉండగా మిగాతా వారు ఇతర శాఖలకు చెందిన వారు డ్యూటీ చేస్తుంటారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తెలిపే తమ అభిప్రాయాల ప్రభావం ఎక్కువగా విద్యాశాఖపైనే పడుతోందన్న చర్చ కూడా సాగుతోంది.