తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సొంత పార్టీ బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తన అనుచరులను సస్పెండ్ చేయడంపై పొంగులేటి స్పందించారు. సస్పెండ్ చేయాల్సి వస్తే తనను చేయాలి గానీ.. తన అనుచరులను కాదని మండిపడ్డారు. తనను ఎప్పుడు సస్పెండ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తనను కాకుల్లా , గద్దల్లా పొడుచుకు తినాలని చూస్తున్నారని పొంగులేటి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో మహిళా సర్పంచ్‌లు మెడలో తాళిబొట్టు తాకట్టు పెట్టి బిల్లులు చెల్లిస్తున్న దుస్థితిలో ఉన్నామని పొంగులేని విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ ధనిక రాష్ట్రాన్ని నిరుపేద రాష్ట్రంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు, మున్సిపాలిటీకు రూ.20 లక్షలు ఇస్తామని చెప్పి నిధులు ఇవ్వకుండా సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వైరాలో తనకు అండగా ఉన్న కొంత మందిని సస్పెండ్ చేశారని.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే తనను సస్పెండ్ చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కళ్లు ఉండి కాబోధిలా శ్రీనన్న బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నాడా లేదా అనేది చూడాల్సింది మీరని తెలిపారు. మొన్నటి వరకు ప్రతి ఫ్లెక్సీలో తన ఫోటో వాడుకున్నారని తెలిపారు. మీరు ప్రజా ప్రతినిధి కావడానికి తనను వాడుకున్నారని చెప్పారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనన్న ఒక్కడే కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే బుద్ది చెబుతారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఎలా సాధించుకున్నామో గుర్తుంచుకోవాలన్నారు.
అధికారం ఎవడబ్బా సొత్తు కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఆ స్థాయికి రావడానికి ఏమి ఇచ్చుకున్నారో మీరే ఆలోచించుకోండని తెలిపారు. అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు, ఎవరినైనా ఇబ్బంది పెడితే వడ్డీ కాదు చక్రవడ్డీ తో తీరుస్తానని హెచ్చరించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జారే ఆదినారాయణను నిలబెడుతున్నానని పొంగులేటి ప్రకటించారు.