దిశ దశ, కరీంనగర్:
అధికారంలో ఉన్న పార్టీలో చేరినా చట్టాలు చుట్టాలుగా మారే ప్రసక్తి లేదంటున్నారు కరీంనగర్ పోలీసు అధికారులు. మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న తీరే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. శుక్రవారం కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో నిందితునిగా ఉన్న కార్పొరేటర్ భర్త కోల ప్రశాంత్ పార్టీ మారినా ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే బాధితుడు రాజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టగా 17వ డివిజన్ కార్పొరేటర్ భర్త కోల ప్రశాంత్ పేరు తెరపైకి వచ్చింది. అప్పటి వరకు నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేయడం, లేని భూమిని ఉన్నదిగా చూపిస్తూ విక్రయించిన కేసును మాత్రమే పరిశీలిస్తున్న పోలీసులు కొత్త కోణం వెలుగులోకి రావడం ఆశ్యర్యం వ్యక్తం చేశారు. లిటిగేషన్ లో ఉన్న భూమిని క్లియర్ చేస్తానంటూ రూ. 50 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ. 20 లక్షలు అడ్వాన్స్ తీసుకోవడంతో పోలీసులు ఈ కేసును మరో కోణంలోనూ విచారించడం మొదలు పెట్టాల్సి వచ్చింది.
పార్టీ మారినా…
అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో నిందితులపై ఎలాంటి చర్యలు ఉండవు అన్న నమ్మకాన్ని పటాపంచలు చేశారు పోలీసులు. ఈ కేసులో కోల ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన తరువాత అక్రమార్కులకు సరికొత్త సంకేతాలు పంపించారు. నేరానికి పాల్పడిన వారు ఏ పార్టీలో ఉన్నా చట్ట ప్రకారం తాము నడుచుకుంటాం తప్ప తప్పించుకునేందుకు మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వబోమని కోల ప్రశాంత్ అరెస్ట్ తో స్పష్టం చేశారు. అధికార పార్టీలో చేరినంత మాత్రాన చట్టం చుట్టంగా మారదని చట్టం చట్టమే చుట్టం చుట్టమేనని స్పష్టం చసినట్టియింది ఈ ఘటనతో. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరితో సేఫ్ అవుతామన్న ఆలోచనలకు దూరం కావల్సిందేనని ఈ ఘటన రుజువు చేస్తోంది.