దిశ దశ, కరీంనగర్:
పూర్వీకుల నుండి వస్తున్న సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శతకోటి గాయత్రి జపయజ్ఞ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి అన్నారు. కరీంనగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ధర్మ అనుష్టాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శతకోటి గాయత్రి జప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉందన్నారు. బ్రాహ్మణులు, తమ నిత్య కర్మలైన సంధ్యా వందనం, గాయత్రి జపంవంటివి ఆచరించడం వల్ల సమస్త మానవాళి శ్రేయస్సుతో పాటు సమాజమంతా సుభిక్షంగా, సుఖశాంతులతో ఉంటుందన్నారు. హడావుడి దైనందిన జీవితంతో కొనసాగుతున్నామన్న భ్రమల్లో ఉంటూ కర్మలను ఆచరించడానికి సమయం సరిపోవడం లేదన్న సాకులుతో సర్దిచెప్పుకోవడం సరికాదని హితవు పలికారు. దైనందిన కార్యక్రమాల్లో కర్మలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి తప్పకుండా ఆచరించాలని, ఇలాంటి సత్కర్మ కార్యక్రమాలను ప్రోత్సహించిన వారు కూడా సత్ఫలితాలు అందుకుంటారని శ్రీ రామచంద్రమూర్తి అన్నారు. ఎంతో పుణ్యం చేస్తే కానీ మానవ జన్మ పొందలేమని, మరు జన్మలో ఏ రూపంలో జన్మిస్తామో తెలియదన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని… ఈ జన్మలోనే పది మందికి ఉపయోగపడేలా సత్కార్యాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వీలైనంత వరకు పరోపకారం చేస్తూ పరోపకారార్థమిదం శరీరం అన్న నానుడిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. మానవ జన్మ సార్థకం చేసుకునే విధంగా జీవన విధానాన్ని మల్చుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు. హైందవ ధర్మం యొక్క విలువలు కాపాడేలా ప్రతి హిందువు ఆచరిస్తున్న విధానాలను సమీక్షించుకుని, ధర్మాన్ని పరిరక్షించే విధంగా వ్యవహరించాలని సూచించారు. ధర్మో రక్షతి: రక్షిత: అన్న శ్లోకాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని, పూర్వీకుల ఔన్నత్యాన్ని ఇనుమడింప చేసే విధంగా మన క్రియలు ఉండేందుకు సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని శ్రీ రామచంద్ర మూర్తి ఉద్భోదించారు. మన ధర్మాన్ని భావితరాలకు అందించే విధంగా నేటీ తరం అనుసరిస్తూ తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కిరిపైనా ఉందన్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post