Mlc elections: “ప్రసన్నం” కానట్టేనా?

దిశ దశ, కరీంనగర్:

కోటి ఆశలతో కార్యరంగంలోకి దూకి… కసరత్తులు చేస్తున్న ఆ విద్యావేత్త ప్రయత్నాలకు ఆదిలోనే చెక్ పడిందా? ఖాయం చేస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకోకపోగా… పక్క పార్టీ వైపు చూసినా సానుకూల ఫలితం రాలేదా? గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు ఆయనకు ప్రతికూల వాతావరణమే ఎదురవుతున్నట్టుగా ఉంది.

ప్రసన్న హరికృష్ణ…

ప్రొఫెసర్ గా, గ్రూప్స్ అభ్యర్థులకు కోచ్ గా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో సుపరిచుతుడు ప్రసన్న హరికృష్ణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అనుబంధం ఉన్న వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సాహసించి మరీ రేవంత్ రెడ్డికి కీలకమైన వ్యవహారాలు చక్కబెట్టారని పేరుంది. అయినా కూడా కాంగ్రెస్ అభ్యర్థిత్వం విషయంలో ప్రసన్నం చేసుకోలేకపోయారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి వైపే కాంగ్రెసు అధిష్టానం మొగ్గు చూపింది. తనకు టికెట్ పక్కా అనుకున్న ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విముఖత చూపుతోందన్న విషయం కొద్ది రోజుల క్రితం అర్థం అయింది. అయితే ఆయన మాత్రం చివరి క్షణం వరకూ టికెట్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యారు. కొన్ని సమీకరణాలు ప్రసన్న హరికృష్ణ అభ్యర్థిత్వానికి ఆటంకంగా మారాయని తెలుస్తోంది.

కారణం..?

అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో మెరిట్స్… డి మెరిట్స్ పై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వి నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణలు పోటీ పడినప్పటికీ అధిష్టానం మాత్రం VNRకే అవకాశం ఇచ్చింది. ఓ వైపున ప్రజాక్షేత్రంలో తిరుగుతూనే మరో వైపున కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నరేందర్ రెడ్డి టచ్ లో ఉండేవారు. టికెట్ కోసం మంత్రాంగం నెరుపుతూనే… నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా మల్చుకోవడంలో సఫలం అయ్యారు. ఒక దశలో ప్రసన్న హరికృష్ణకు అత్యంత సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి టికెట్ వచ్చే ప్రసక్తే లేదని, హరికృష్ణను గెలిపించుకుని తీరుతామని ఆయన మొఖం మీదే చెప్పేశారట. అయినప్పటికీ VNR తనవంతు ప్రయత్నాల్లో మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే హరికృష్ణ, నరేందర్ రెడ్డి ఇద్దరూ కూడా విద్యారంగంలోనే ఉన్నప్పటికీ అల్ఫోర్స్ గ్రూప్స్ ఛైర్మన్ గా నరేందర్ రెడ్డికి గుర్తింపు ఉండడం కూడా లాభించినట్టుగా తెలుస్తోంది. పేరెంట్స్, స్టూడెంట్స్ తో పాటు ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలు ఉండడం కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది 2018 ఎన్నికలకు ముందే తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న నరేందర్ రెడ్డి ఉద్యమ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారన్న విషయం కూడా ప్లస్ అయింది. టికెట్ రేసులో ఉన్న నరేందర్ రెడ్డి పక్కా ప్లాన్ గా ముందుకు సాగారు. అయితే హరికృష్ణ కూడా ప్రజాక్షేత్రంలోకి దిగినప్పటికీ పార్టీ మెయిన్ లీడర్లను ప్రభావితం చేయలేకపోయారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉంటాయని సరిపెట్టుకోవడం కూడా మైనస్ అయినట్టు సమాచారం. ఆయన ఆర్గనైజేషన్ లో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం కూడా కొంతమేర నష్టాన్ని చేకూర్చినట్టుగా స్పష్టం అవుతోంది. ఆయన చుట్టూ చేరిన కోటరితో అన్ని వర్గాలను సమీకరించడంలో విఫలం అయ్యారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొదట్లో వివిధ రంగాల్లో స్థిరపడిన ప్రొఫెషనల్స్ ను వ్యక్తిగతంగా కలిసిన ఆయన ఆ తర్వాత సదస్సులు ఏర్పాటు చేయడానికే పరిమితం అయ్యారు. కోచింగ్ ఇవ్వడం వల్ల… పబ్లికేషన్స్ తో సంబధం ఉన్నవారికి మాత్రమే ప్రసన్న హరికృష్ణ పరిమితం అయ్యారని, మిగతా క్షేత్రలలో ఉన్న వారితో అంతగా సంబధాలు అంతగా లేకపోవడం కూడా ఎంపిక విషయంలో ప్రతికూలతను తెచ్చి పెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గులాబీ వైపు…

కొద్ది రోజులుగా ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ టికెట్ వచ్చే అవకాశం లేదన్న విషయంపై క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. దీంతో అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీవైపునకు ఆయన అడుగులు పడడం మొదలు పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. BRS PARTY తరపున పోటీ చేస్తారని కూడా ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. గులాబీ బాస్ వద్ద కూడా ప్రసన్న హరికృష్ణ పేరు పరిశీలనకు వెల్లినట్టుగా సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ప్రసన్న హరికృష్ణ పేరును పరిశీలించినట్టుగ తెలుస్తోంది. అయితే Brs కూడా ఆయన చేరిక విషయంలో NO అని చెప్పీనట్టుగా సమాచారం.

ఆ “టూర్

ప్రసన్న హరికృష్ణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విముఖత చూపడం వెనక రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ పర్యటన ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పర్యటించినప్పుడు ప్రసన్న హరికృష్ణ పార్టీలో చేరే అంశంపై ఒకరిద్దరు ముఖ్య నాయకులతో డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆయన చేరడం, ఆయనకే టికెట్ ఇవ్వడం వల్ల తమలాంటి వారికి అన్యాయం జరుగుతుందని కవిత ధృష్టీకి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అప్పటికే పార్టీ అభ్యర్థిని బరిలో నిలపాలా? మద్దతు ప్రకటించాలా అన్న విషయంపై బీఆర్ఎస్ పార్టీలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వారిని జాయిన్ చేసుకుని వారినే అందలం ఎక్కించడం అవసరమా అన్న ఆలోచనలో కూడా పార్టీ ముఖ్య నాయకులు ఉన్నట్టుగా తెలిసింది. దీంతో ప్రసన్న ఎంట్రీ విషయంలో పార్టీ నాయకులు”No” చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రసన్న హరికృష్ణ భవితవ్యం ఏంటన్నది తేలాల్సి ఉంది. బరిలో నిలుస్తారని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఒంటరి పోరాటం చేస్తారా లేక తప్పుకుంటారా అన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది.

You cannot copy content of this page