దిశ దశ, కరీంనగర్:
మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మనుసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరడంతో పాటు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా లేనని ప్రవీణ్ రెడ్డి గతంలో తెలిపారు. కానీ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్న ఆయన ఈ రోజు దరఖాస్తు చేసుకోనున్నారు. అధిష్టానం కూడా కరీంనగర్ నుండి ‘రెడ్డి’ సామాజికి వర్గాన్ని బరిలో దింపాలన్న యోచనలో ఉండడంతో దాదాపు ఆయనకు టికెట్ ఖరారు అయినట్టేనని భావిస్తున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి ముల్కనూరు సహకార బ్యాంకుకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తండ్రి ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు ద్వారా హుస్నాబాద్, హుజురాబాద్ ప్రాంతంలోని పలు గ్రామాల రైతాంగానికి అనుభందం ఏర్పడింది. అంతేకాకుండా కరీంనగర్ లోకసభ పరిధిలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం కూడా కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీపై సానుకూలత వ్యక్తం అవుతుండడం కూడా లాభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే కరీంనగర్ ఎంపీ టికెట్ ను వెలిచాల రాజేందర్ రావు కూడా ఆశించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో మంతనాలు కూడా జరిపారు. ఈ క్రమంలో ప్రవీణ్ రెడ్డి కూడా తనకు ఆసక్తి లేదని చెప్పడంతో రాజేందర్ రావు ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. కానీ ఊహించని రీతిలో ప్రవీణ్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు రావడంతో ఆయనకు అధిష్టానం నుండి కూడా క్లియరెన్స్ వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.