వాష్ రూమ్ చూసి షాక్ అయిన వైద్యులు
దిశ దశ, జనగామ:
పురిటి నొప్పులు వస్తున్నాయని ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు డెలివరీ చేసేందుకు సిద్దమయ్యారు డాక్టర్లు… అంతలోనే వాష్ రూమ్ కు వెల్లొస్తానని చెప్పి… వెంటనే తిరిగొచ్చి మీ నిర్లక్ష్యం వల్లే నా కడుపులో పిండం పడిపోయిందంటూ హంగామా చేసింది. అసలేం జరిగిందోనని వాష్ రూమ్ కు వెల్లి చూసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. ఆ వాష్ రూమ్ లో కనిపించిందేంటీ..? ఆమె హంగామా చేయడానికి కారణమేంటీ..?
జనగామ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. జిల్లాలోని దేవురుప్పుల మండలం నాగులగుంట గ్రామానికి చెందిన ఓ యువతికి రాగ్యానాయక్ తండాకు చెందిన యువకుడితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. 8 నెలల క్రితం తాను గర్భం దాల్చానని భర్తకు, అత్తా మామలకు చెప్పడంతో్ వారంతా సంతోషించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెల్లి చికిత్స చేయించుకుంటోంది. 8 నెలలు నిండిన సదరు మహిళ తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పి జనగామ జిల్లాకేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు సాధారణ ప్రసవం చేస్తామని వైద్యులు చెప్పవడంతో వాష్ రూమ్ కు వెల్లొస్తానని చెప్పింది. వెంటనే తిరిగి వచ్చిన ఆమె ఆసుపత్రి వైద్యులతో పాటు సిబ్బందిపై చిందులు వేయడం ఆరంభించింది. తన కడుపులో పెరిగిన బిడ్డ వాష్ రూమ్ లో పడిపోయిందని మీ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆమె పరిస్థితిని గమనించిన ఆసుపత్రి యంత్రాంగం ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. తమ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలతో ఉండాల్సిన పిండం అచేతనంగా పడిపోయిందన్న ఆందోళన ఓ వైపు అయితే తమ ఉద్యోగాలు పరిస్థితి ఏమవుతుందోనన్న కలవరం వారిని వెంటాడింది. అయినప్పటికీ ఓ సారి వాష్ రూమ్ వెల్లి చూసోద్దామని వెల్లిన వైద్య సిబ్బందికి షాకింగ్ నిజం తెలిసింది.
ఏమిటా నిజం…
అయితే సదరు మహిళ వెల్లిన వాష్ రూమ్ ను పరిశీలించిన ఆసుపత్రి యంత్రాంగం అక్కడ కనిపించిన వాటిని చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బాత్ రూమ్ లో పిండం కనిపించకపోగా కొన్ని బట్టలు పడేసి ఉండడం చూసి అనుమానించారు. అసలేం జరిగిందో అర్థం కాక ఆసుపత్రి సిబ్బంది సదరు మహిళకు చికిత్స అందించేందుకు సమాయత్తం కాగా అసలు అమె గర్భమే దాల్చలేదని గుర్తించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను ప్రశ్నిస్తే… వారిపైనే కౌంటర్ అటాక్ చేస్తుండడంతో ఓపిక నశించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె నుండి అసలు విషయం రాబట్టారు. అసలు ఆమె గర్భమే దాల్చలేదని, పెళ్లయి రెండేళ్లు అయినా గర్భం దాల్చడం లేదని అత్తింటి వారు తిడుతున్నారని, అందుకే తనకు గర్భం వచ్చినట్టుగా నటించానని పోలీసులకు వివరించింది. తనకు ప్రెగ్నెన్సి వచ్చిందని నమ్మించేందుకు గుడ్డలు చుట్టుకున్నానని 8 నెలలుగా ఇదే విధంగా వ్యవహరించానని పోలీసులకు చెప్పింది. ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా రెండు చీరలను కడుపు వద్ద చుట్టుకుని గర్భవతిని అయ్యానంటూ ఆసుపత్రికి చేరుకున్నానని కూడా పోలీసుల ముందు ఒప్పుకుంది.
8 నెలలుగా ఎలా…
అయితే సదరు మహిళ తాను గర్భం దాల్చినట్టుగా 8 నెలలుగా అత్తింటి వారిని నమ్మించిన తీరే అందరిని విస్మయపరుస్తోంది. వారి కళ్లుగప్పి తాను గర్భం దాల్చని విషయాన్ని ఎలా కప్పిపుచ్చుకుందన్నదే అంతుచిక్కకుండాపోయింది. కనీసం భర్తకు కూడా తెలియకుండా ఎలా జాగ్రత్త పడిందో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. ప్రతి నెల కూడా చికిత్స కోసం ఆసుపత్రికి వెల్తున్న సదరు మహిల పరీక్షలు జరిపిన వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని ఎలా నమ్మించారోనన్న విషయంపై తర్జనభర్జలు సాగుతున్నాయి. ఏదో ఒక నెలలో అయినా ఆమె అసలు గర్భం దాల్చలేదన్న విషయాన్ని గుర్తించకపోవడం వెనక ఉన్న మతలబు ఏమిటోనని కూడా స్థానికులు గుసగుసలాడుతున్నారు. అయితే ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు, వైద్యులు సమాయత్తం అయ్యారు.