మేడిగడ్డ ‘ఢాం’… బాంబ్ పేల్చిన విజిలెన్స్…

వాట్ టు డూ… వాట్ నాట్ టు డూ…

దిశ దశ, భూపాలపల్లి:

మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపాల ఉచ్చు బిగించడం మొదలైంది. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నిర్ధారణతో నిర్మాణ లోపాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నివేదికతో ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థల పనితీరు ఎంటో తెలిసిపోనుంది. ఓ ఎంపీ అన్న విషయాన్ని కూడా మరిచిపోయిన ఇరిగేషన్ ఇంజనీర్లు వాట్సప్ గ్రూపుల్లో రాహుల్ గాంధీ పర్యటనపై కూడా సెటైర్లు, విమర్శలు చేశారు. తాజాగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తేల్చిన విషయంతో  మేడిగడ్డ నిర్మాణంలో ఎంతమేర వైఫల్యాలు ఉన్నాయో స్పష్టం అవుతోంది.

కుంగుబాటుతో…

గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఏమీ జరగనట్టుగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా డ్యామేజీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అధికారులు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో హుటాహుటిన ఎల్ అండ్ టి ఇంజనీర్ సురేష్ మేడిగడ్డ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మెయింటనెన్స్ తమదేనని తప్పిదాలు సవరిస్తామంటూ ప్రకటించారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ ఎంతమేర డ్యామేజ్ అయిందన్న విషయాన్ని మాత్రం అధికారులు స్పష్టంగా చెప్పలేదు. కానీ రాష్ట్రంలో అధికారం మారిన తరువాత మేడిగడ్డపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్స్ ను రంగంలోకి దింపి సమగ్రమైన విచారణ జరిపించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కూడా క్షేత్ర స్థాయిలో విచారణ జరపడం గమనార్హం. ప్రాథమికంగా విజిలెన్స్ అధికారులు నిర్దారణకు వచ్చిన అంశాలను గమనిస్తే… మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీని పూరించడం అసాధ్యమన్న భావనకే వచ్చినట్టుగా తెలుస్తోంది. 2019లోనే ఈ బ్యారేజ్ లో లోపాలు బయటపడ్డాయని కాగ్ కూడా తన నివేదికలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మేడిగడ్డ కుంగుబాటు తరువత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) టీమ్ కూడా నిర్మాణ లోపాలను ఎత్తి చూపింది. తాజాగా విజిలెన్స్ అధికారులు కూడా రూ. 3200 కోట్లు వృధా అయ్యాయన్న భావనకు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. మధ్యంతర నివేదిక ఇచ్చేందుకు కూడా విజిలెన్స్ అధికారులు సమాయత్తం అయ్యారు. కొంతమంది అధికారులతో పాటు నిర్మాణ కంపెనీ తప్పిదాలు కూడా ఉన్నాయని విజిలెన్స్ విభాగం గుర్తించినట్టుగా తెలుస్తోంది.

ఎల్ అండ్ టి..?

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ కంపెనీ ఎల్ అండ్ టీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థల్లో ఒకటి. నిర్మాణాల్లో ప్రామాణికతలు పాటించే విషయంలో ఆ సంస్థకు ఉన్న క్రెడిబులిటీ అంతా ఇంతా కాదు. దేశంలో కూడా చాలా చోట్ల ఎల్ అండ్ టికి ఓ బ్రాండ్ ఉంది. అయితే ఈ సంస్థకు మేడిగడ్డ వైఫల్యం ఓ ఫెయిల్యూర్ ను తెచ్చిపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్ అండ్ టి వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా వ్యవహరించడం ఏంటన్నదే ఇప్పుడు పజిల్ గా మారిపోయింది. ఇంటర్నేషనల్ కన్సట్రక్షన్ కంపెనీల్లో ఒకటైన ఎల్ అండ్ టి ప్రత్యేకంగా ఓ ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. వీరు నిర్మాణాల విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పర్యవేక్షించడంతో పాటు ప్రాక్టికల్ గా ఎదురయ్యే లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు కూడా ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతుంటారు. అలాంటి పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్న ఎల్ అండ్ టి మేడిగడ్డ బ్యారేజీ విషయంలో వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.

ఇరిగేషన్ టీమ్ ఏం చేసింది..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి నుండి చీఫ్ ఆఫీసర్ల వరకు సపరేట్ గా ఈ యంత్రాంగాన్ని డిప్యూట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈఎన్సీలతో పాటు సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, డీఈఈ, ఏఈఈ, వర్క్ ఇన్స్ పెక్టర్లు, డీఎంలు తదితర యంత్రాంగాన్ని అంతా కూడా నియమించింది. వీరంతా కూడా ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించిన ప్రతిపాదనల నుండి సైట్ ఎంపిక, నిర్మాణంలో ప్రామాణికతలు పాటించే విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అటు కన్సట్రక్షన్ కంపెనీ, ఇటు ఇరిగేషన్ అధికార యంత్రాంగం పర్యవేక్షణలో జరిగిన ఈ నిర్మాణంలో లోపాలు ఎలా చోటు చేసుకన్నాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఎదురు దాడులు…

రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం సహజం. విమర్శలు కూడా ఆయా పార్టీల నాయకుల మధ్య సాగుతూ ఉంటాయి. గతంలో ఏనాడూ కూడా అధికార యంత్రాంగం బాహాటంగా ఎదురు దాడులు చేయడం కానీ, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులను విమర్శలు చేసిన సందర్భలు లేవనే చెప్పాలి. ప్రభుత్వ ప్రతినిధులుగా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వారి వాదనలు వినిపిస్తుంటారు. టెక్నికల్ పరమైన అంశాలు, తామేం ఎలా వ్యవహరించాం అన్న వివరాలను ప్రజలకు వివరించేందుకు మాత్రమే అధికారయంత్రాంగం పరిమితం అయ్యేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మేడిగడ్డ కుంగిపోయిన తరువాత ఏఐసీసీ అధినేత, ఎంపీ కూడా అయిన రాహుల్ గాంధీ క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అయితే కొంతమంది ఇరిగేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి రాహుల్ గాంధీని విమర్శలకు సంబంధించిన కామెంట్స్ ను మేడిగడ్డ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు. వాస్తవంగా ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ నాయకుల వలె విమర్శలు చేయడం సరికాదు. కానీ మేడిగడ్డ విషయంలో మాత్రం ఈ కామెంట్స్ ను ఆయా వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయడం విస్మయానికి గురి చేసింది. ఆనాడు రాహుల్ గాంధీపై విమర్శలు షేర్ చేసిన వారిపై శాఖపరంగా కూడా అభ్యంతరలు వ్యక్తం కాకపోవడం విడ్డూరం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాట్సప్ గ్రూపుల్లో అదికారులు షేర్ చేసిన విషయాలపై సైబర్ క్రైమ్స్ వింగ్ ద్వారా నిజానిజాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. 

You cannot copy content of this page