దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలోని నీటి వనరులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఇరిగేషన్ విభాగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ కార్యదర్శి, ఈఎన్సీ, చీఫ్ ఇంజనీర్ లతో ప్రత్యేకంగా సమావేశం అయిన మంత్రి పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఆయాకట్టుకు నీరందించేందుకు ఏఏ ప్రాజెక్టుల సిద్దంగా ఉన్నాయో వాటి వివరాలను తయారు చేయాలన్నారు. ఆరు నెలల్లో కొత్త ఆయాకట్టుకు నీరందించే అవకాశం ఉన్నా ప్రాజెక్టులు, ఏడాదిలోపు ఆయా సిద్దమయ్యే ప్రాజెక్టులు, రెండేళ్ల లోపు తయారయ్యే వాటి వివరాలను తెలపాలన్నారు. వీటి వివరాల ఆధారంగా బడ్జెట్ కెటాయింపులతో పాటు ఎంతమేర నిధులు అవసరం ఉంటాయోనన్న విషయంపై స్ఫస్టత వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. PMKSY పథకం ద్వారా PRL నీటిపారుదల పథకం యొక్క కేంద్ర నిధుల కోసం పంపవలసిన ప్రతిపాదనల వివరాలు, వేసవిలో అవసరమైన చోట చెరువులు పూడిక తీయడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. వచ్చే బడ్జెట్ సెషన్ లో నీటి పారుదల రంగంపై శ్వేత పత్రం కూడా విడుదల చేసేందుకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక తయారు చేయాలన్నారు.