కితాబిచ్చిన గవర్నర్ తమిళి సై…
దిశ దశ, భూపాలపల్లి:
ఓ వైపున విద్యలో రాణిస్తూ మరోవైపున క్రియేటివిటీకి కేరాఫ్ గా తయారైన ఆ చిన్నారుల్లోని అద్భుత ప్రతిభను ప్రత్యక్ష్యంగా చూసిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై అభినందనల్లో ముంచెత్తారు. హైస్కూల్ స్థాయిలోనే అద్భుత ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్న వారిని రాజ్ భవన్ లో ఘనంగా సత్కరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ హైస్కూల్ విద్యార్థులు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కలిశారు. లిప్ మూవ్ మెంట్ ను అబ్జర్వ్ చేసి దూరంగా ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు..? ఐబ్రోస్ (కనుబొమ్మల) కదలికలతో వారు ఏమని సైగ చేసుకుంటున్నారో ఇట్టే గుర్తు పట్టేయగలరు ఆ చిన్నారులు. అంతేకాకుండా చెవులతో చేసుకునే సైగలు… జంతువులకు మాత్రమే సాధ్యం అయ్యే చెవులను కదలించే ప్రక్రియను ఈ చిన్నారులు సుసాధ్యం చేయడమే కాదు ఈ సైగలకు సంబంధించిన లిపిని కూడా తయారు చేసి తమ క్రియేటివిటీ ఏంటో చేతల్లో చూపించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఈ హైస్కూల్ విద్యార్థులకు లక్ష్యం నిర్దేశించి వారిని సుశిక్షుతులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో టీచర్ మడ్క మధు వారితో మమేకం అయ్యారు. నిరంతరం చర్చలు చేస్తూ వారిలో ఉన్న ఆసక్తిని గమనించి అందుకు తగిన రీతిలో ప్రోత్సహించడంతో విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అయితే వైవిద్యతను ప్రదర్శించిన ఈ చిన్నారుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అయినప్పటికీ వారిని వెన్ను తట్టి ప్రోత్సహించి వారిలోని క్రియేటివిటీకి పదును పెట్టడంతో నేడు రాజ్ భవన్ లో ఘన సన్మానాన్ని అందుకోగలిగారు. శిథిలమైన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నా క్రియేటివిటిని మాత్రం కొత్త పుంతలు తొక్కించిన మహదేవపూర్ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావల్సి ఉంది.
గ్రేట్ అచీవ్ మెంట్: గవర్నర్ తమిళి సై
ఈ విద్యార్థుల ప్రతిభను ప్రత్యక్ష్యంగా చూసిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆశ్యర్యం వ్యక్తం చేశారు. గురువారం మహదేవపూర్ హైస్కూల్ విద్యార్థులకు భూపాలపల్లి బీజేపీ నేత చందుపట్ల కీర్తి రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా గవర్నర్ ను కలిసే అవకాశం దొరికింది. వారు చేసిన క్రియేటివిటీ గురించి వివరించడం పాటు ప్రదర్శించడంతో విద్యార్థులను అభినందించారు గవర్నర్. పాఠశాలలో ఉన్న సౌకర్యాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్న గవర్నర్ తమిళి సై టాయిలెట్స్ నిర్మాణం చేయించేందుకు నిధులు కెటాయిస్తామని చెప్పారు. ఇలాంటి విద్యార్థులను వెన్నుతట్టి ప్రొత్సహించాల్సి అవసరం ఉందని, వారికి తన ఆశీస్సులు ఎల్ల వేళలా ఉంటాయన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో ఉపాధ్యాయులు ముల్కల తిరుపతి, మడ్క మధులు కూడా ఉన్నారు.