ధర్మపురిలో తాగునీటి కోసం నిరసనలు
దిశ దశ, జగిత్యాల:
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముందస్తు అరెస్ట్ అయినప్పటికీ అక్కడ మాత్రం నిరసనలకు బ్రేకు పడలేదు. మహిళా నాయకులంతా కలిసి తమ సమస్యను బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో తాగునీటి కటకట ఏర్పడిందని, మిషన్ భగీరథ కూడా సానుకూల ఫలితాన్ని ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తమయింది. ఈ నేపథ్యంలో ధర్మపురి వాసుల తాగునీటి కష్టాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పట్టణంలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ కుమార్ కూడా ఈ ఆందోళనలో పాల్గొనాల్సి ఉండగా, జగిత్యాల పోలీసులు ఆయన్ను ముందస్తు అరెస్ట్ చేశారు. కరీంనగర్ విద్యారణ్యపురిలో ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటికి మంగళశారం ఉదయమే చేరుకున్న జగిత్యాల పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో జగిత్యాలలో తాగునీటి కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి బ్రేకు పడిపోయిందని భావించారంతా. కానీ ధర్మపురికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు వెనకడుగు వేయకుండా తమ గళాన్ని వినిపించారు. ధర్మపురి పట్టణంలో తాగు నీటి కొరతతో అల్లాడిపోతున్నామని, గోదావరి చెంతనే ఉన్న తమకు మాత్రం కష్టాలు తప్ప డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా మునిసిపల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పటికీ తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలం అయ్యారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు గోదావరి నది జలాలను తీసుకొచ్చి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడంతో నిరసన కొనసాగే అవకాశాలు లేవని వేసుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ పట్టణ మహిళలు వెనుకంజ వేయకుండా ఆందోళనలను యథావిధిగా కొనసాగించడం గమనార్హం.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post