దిశ దశ, కరీంనగర్:
భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మద్యాహ్నం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. స్థానిక ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్న ప్రదాని కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించాలని అభ్యర్థించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని సభలు పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో వాటన్నింటిని మించి జనసమీకరణ చేయాలన్న లక్ష్యంతో స్థానిక బీజేపీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తున్న నేపథ్యంలో గెలుపు తీరాల్లో ఉన్న వారిని ప్రధాని మోడీ ప్రసంగం గట్టెక్కిస్తుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పట్టు నిలుపుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రుని పర్యటనతో గతంలో బీజేపీ క్రియేట్ చేసిన ట్రాక్ రికార్డును బ్రేక్ చేయాలన్న యోచనలో ఇక్కడి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణాలో బీజేపీకి ఎక్కువగా సానుకూల ఫలితాలను అందించిన జిల్లాల్లో కరీంనగర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు పార్టీ అందుకున్న విజయాలను దాటి కొత్త రికార్డు సృష్టించాలన్న సంకల్పంతో బీజేపీ నాయకత్వం ఉంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్న బండి సంజయ్ సోమవారం నాటి ప్రధాని సభకు భారీగా జనసమీకరణ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అటు జనసమీకరణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటూనే ఇటు ప్రచారంలో నిమగ్నం అవుతున్నారు. సోమవారం రాత్రి ఎస్సారార్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకున్న బండి సంజయ్ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ముచ్చటగా మూడో సారి…
నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కరీంనగర్ పర్యటనకు వస్తున్నారు. 2009లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో కరీంనగర్ కు వచ్చిన ఆయన ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బండి సంజయ్ అభ్యర్థన మేరకు జాతీయ నాయకత్వం సూచించడంతో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో కరీంనగర్ టూర్ కు వచ్చారు. ఇదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం కాకినాడ కేజ్ గ్యాస్ బేసిన్ నుండి చమురు నిక్షేపాలు వెలికితీసే కాంట్రాక్టు పొందింది. అయితే కాకినాడ నుండి వెలికితీసే చమురును తెలంగాణాకు సరఫరా చేస్తానని ఆ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఇటీవలే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గ్యాస్ సరఫరాకు అవసరమైన పైప్ లైన్లను వేసే ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. తాజాగా నిర్వహిస్తున్న వేదిక కూడా అదే గ్రౌండ్ లో కావడం విశేషం. 2014లో జాతీయ ప్రచార కమిటీ ఛైర్మన్ హోదాలో కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా కరీంనగర్ ఎంపీగా సిహెచ్ విద్యాసాగర్ రావును, ఎమ్మెల్యేగా బండి సంజయ్ ని గెలిపించాలని అభ్యర్థించారు. అయితే అప్పటి ఎన్నికల్లో కరీంనగర్ ఓటర్లు బీజేపీ అభ్యర్థులను అక్కున చేర్చుకోకున్నప్పటికీ సాగర్ జీని మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. అయితే 2009లో మోడీ బహిరంగ సభకు హాజరైన సభ ఏర్పాట్లు చేసిన బండి సంజయ్ ఆ తరువాత పార్టీలో జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. రాష్ట్ర పార్టీ బాధ్యునిగా వ్యవహరించిన సంజయ్ 2018 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికి స్థానిక సమీకరణాల కారణంగా ఓటమీ పాలయ్యారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన సంజయ్ ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే సాధారణ కార్పోరేటర్ గా ఉన్న బండి సంజయ్ ఎస్సారార్ కాలేజీలో మోడీ సభ నిర్వహించిన తరువాత ఉన్నత స్థాయికి ఎదిగారన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది. తిరిగి అదే ప్రాంగణంలో నిర్వహిస్తున్న వేదికపై ప్రధాని హోదాలో మోడీ హాజరు కానున్నందున సంజయ్ కి మరిం ప్రాధాన్యత పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.