తమిళనాడా… తెలంగాణా..? దక్షిణాది వైపు బీజేపీ చూపు…

దిశ దశ, హైదరాబాద్:

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడే దిశగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఉత్తర భారతంలో పటిష్టంగా ఉన్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న విషయంపై బీజేపీ జాతీయ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో…

దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ వైఫల్యాలకు గల కారణాలపై ఫోకస్ చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చే లోకసభ ఎన్నికల్లో భారీగా ఎంపీలను గెలిపించుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోవడం, తెలంగాణాలో పార్టీ బలోపేతం అయినట్టే అయి పట్టు కోల్పోయిన తీరు, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగితే బావుంటుంది, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి అన్న అంశాలపై సుదీర్ఘంగా జాతీయ నాయకత్వం చర్చలు సాగించినట్టు సమాచారం. దీంతో దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతం కావాలంటే ప్రధాని మోడీ చరిష్మా అత్యంత కీలకమని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తమిళనాడు యూత్ తో పాటు కొన్ని వర్గాలను బీజేపీ వైపు ఆకర్షించే ప్రయత్నాల్లో రాష్ట్ర అధ్యక్షుడు నిమగ్నం అయి సానుకూల ఫలితాలు తీసుకొస్తున్నారని, తెలంగాణాలో కూడా గతంలో కంటె ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెల్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయామన్న విషయంపై జాతీయ నాయకత్వం పోస్టు మార్టం చేసినట్టుగా తెలుస్తోంది. క్షేత్ర స్థాయి అంశాలను గమనించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలను రాబట్టకపోవడానికి ఓ కారణం అన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయం రెపరెపలాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.

ఎక్కడయితే బెటర్..?

అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పోటీ చేయాలన్న నిర్ణయం దాదాపు ఖరారు అయినందున ఆయనను ఎక్కడి నుండి పోటీ చేయిస్తే బావుంటుందన్న విషయంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో కూడా బీజేపీ పాగా వేయడం ఆరంభించిన నేపథ్యంలో ఈ రాష్ట్రం నుండి ఎంపీగా పోటీ చేయడం మంచిదా లేక తెలంగాణ అయితే మంచిదా అన్న విషయంపై సునిశితంగా పరిశీలిస్తోంది జాతీయ నాయకత్వం. ప్రధాని మోడీతో పాటు కీలక నేతలు ఓకె చెప్పిన వెంటనే ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారో ప్రకటించే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో ప్రధాని మోడీ చేస్తే సానుకూలత ఉంటుందని గుర్తించిన లోక సభ నియోజకవర్గాలకుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సిద్దం చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page