భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. నవంబర్ 11, 12 తేదీల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 11 సాయంత్రం మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని ఆ రాత్రి చోళ షూట్‌లో బస చేస్తారు. మరునాడు అంటే 12 ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీకి చేరుకుంటారు. ఉదయం 10.30 నుంచి 10.45 గంటల వరకు ఏయూలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 10,742 కోట్ల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమం అనంతరం 12 గంటలకు విశాఖ నుంచి తిరుగు బయల్దేరుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ప్రధాని ప్రయాణించే రహదారికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
12న తెలంగాణాలో…
మరునాడు తెలంగాణాలో పర్యటించనున్న ప్రధాని విశాఖపట్నం నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి హెలిక్యాప్టర్ లో పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకుంటారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసగిస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.
రెండు రాష్ట్రాల్లోనూ ఉద్రికత్త..
అయితే ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉద్రిక్తత పరిస్థితులే నెలకొన్నాయి. ఏపీలో విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ విషయంలో పీఎంకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే అవకాశం ఉంది. తెలంగాణాలో కూడా ఎమ్మార్పీఎస్ వర్గీకరణ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తుండగా యూనివర్శిటీ విద్యార్థులు కూడా పలు డిమాండ్లతో ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల పోలీసులు అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పకడ్బందీగా బందోబస్తు చర్యలు తీసుకోనున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post