హుజురాబాద్ బైపోల్స్ లోనే కేసీఆర్ కు ట్రైలర్ చూపించారు…

అధికారంలోకి వచ్చిన తొలిరోజే పెట్రోల్ ధర తగ్గింపు

దిశ దశ, కరీంనగర్:

హుజురాబాద్ ఉప ఎన్నికలతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ట్రైలర్ చూపించారని, ఈ ఎన్నికల్లో ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పతనం తప్పదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రధాని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించిన ప్రధాని తెలంగాణాలో అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని నిర్ణయించుకున్నామని, ఈ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నందున కౌమర దశకు చేరుకున్న రాష్ట్రాన్ని అన్నింటా ముందుకు నడిపించే వారికే అందలం ఎక్కించాలన్నారు. పదేళ్ల వచ్చిన బిడ్డలను ఎలా తీర్చిదిద్దాలోనన్న విషయంపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారిస్తారని, 15 ఏళ్ల వరకు బిడ్డల బాగోగులను ప్రత్యేకంగా పట్టించుకుని వారిని సన్మార్గంలో నడిపించడంతో పాటు ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కూడా 10 ఏళ్ల ప్రాయంలోకి వచ్చినందున రాష్ట్ర బాగోగులు చూసుకునే బీజేపీకే పట్టం కట్టాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రాన్ని అన్నింటా అభ్యున్నతి వైపు తీసుకెళ్లే వారికే ఓటు వేయాలని, అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలంటే కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. తెలంగాణ ప్రజల్లో మార్పు కనిపిస్తోందని… బీఆర్ఎస్ పార్టీని పారదొలాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదంటూ ప్రధాని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ లో చేరారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని మోడీ స్పష్టం చేశారు. కరీంనగర్ మట్టి భారత ప్రధాని పివి నరసింహరావు పుట్టారని… కుటుంబ పాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నచ్చక ఆయన్ని అన్నింటా అవమానాలకు గురి చేశారని మోడీ ఆరోపించారు. కుటుంబ పార్టీ ఎప్పుడు కూడా తన సంతానం బాగుండాలని చూస్తుంది కానీ ప్రజల సంతానం గురించి ఏ మాత్రం చింత పెట్టుకోదన్నారు. కుటుంబ పార్టీలు అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల పిల్లల ఉజ్వల భవిష్యత్తును విస్మరిస్తాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని వీటి విషయంలో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలంటే అది బీజేపీకి మాత్రమే సాధ్యమని, కుటుంబ పార్టీలు తమ స్వార్థంతో అన్నింటా భ్రష్టుపట్టిస్తాయని నరేంద్ర మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో పీఎఫ్ఐతో పాటు అసాంఘీక శక్తులు షెల్టర్ తీసుకున్నాయన్నారు. కరీంనగర్ లో నక్సల్స్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పోరాటం చేసిన చరిత్ర ఉందన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చి అభివృద్ది చేయాలని సంకల్పంచామని, అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ ను లండన్ చేస్తానని అబద్దపు హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కరీంనగర్ వికాసం కోసం బీజేపీ కట్టుబడి ఉందని, ఇక్కడి ప్రాచీన చరిత్రతో ఉన్నత శిఖరాలకు చేర్చడమే తమ లక్ష్యమని ప్రధాని ప్రకటించారు. రైతులకు సాగు నీరు ఇస్తానన్న కేసీఆర్ రూ. కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. తెలంగాణ ప్రజల కోసమే బాయిల్డ్ రైస్ కొంటున్నామని, ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ ఫిలిగ్రీ ఆర్ట్ గురించి మన్ కీ బాత్ లో మాట్లాడనని, పీఎం విశ్వకర్మ యోజన ద్వారా ఫిలిగ్రీ కళాకారులకు నూతన సాంకేతికతను అందించడంతో వ్యాపారాభివృద్ది కోసం కృషి చేయనున్నామన్నారు. కరీంనగర్ ను సిల్వర్ సిటీ గా గుర్తింపు తీసుకరానున్నామన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చేది బీజేపీ మాత్రమేనని వెల్లడించారు. అందరికి రేషన్, వైద్యం, రైతులకు బాసట, కుటుంబ పాలనకు అస్కారం లేని విధానం, అవినీతి రహిత పాలన, పేదల సంక్షేమంతో పాటు పారదర్శకమైన పరిపాలన తీరు అంతా కూడా మోడికా గ్యారెంటీ అని అన్నారు. నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడమే మోడీ లక్ష్యమని అయితే తాము నిధులు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం డబుల్ ఇళ్లు కట్టివ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను దోపిడీ చేయడానికి కూడా వెనకాడారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ తక్కువ ధరలో దొరుకుతుంది కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం లభ్యం కావడం లేదన్నారు. తెలంగాణాలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి రోజునుండే తక్కువ ధరకే పెట్రోల్ అందిస్తామని ప్రధాని ప్రకటించారు. బీజేపీకి అవకాశం ఇచ్చిన ఆనందం పెట్రోల్ ధర తగ్గింపు నుండే ప్రారంభమవుతుందన్నారు. మోదీ గారి గ్యారంటీ అంటే… గ్యారంటీగా పూర్తి అయ్యే వారంటీ ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని, అందులో భాగంగానే తెలంగాణాలో బీసీ సీఎంను చేస్తున్నామని వివరించారు. కేసీఆర్ పై విశ్వాసం లేకుండాపోయిందని, ఆయన కుటంబ పాలన కోసం తెలంగాణ ఆవిర్భావించినట్టుగా మార్చుకున్నారని మండిపడ్డారు. నీళ్లు నిధులు, నియామకాలు అన్న నినాదంతో రాష్ట్ర ఆవిర్భవిస్తే… కన్నీళ్లు… మోసాలు… నిరుద్యోగులు… అన్నట్టుగా మార్చేశారని తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదని. డిసెంబర్ 3 నాడు బీఆర్ఎస్ టికెట్ కట్ అవుతుందన్నారు. ఒక రోగం తగ్గించుకునేందుకు మరో రోగాన్ని కొనితెచ్చుకోవద్దని, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో అధికారం ఇచ్చినట్టయితే మరో రోగం కొని తెచ్చుకున్నట్టవుతువుందన్నారు. బీజేపీ, మోడీపై భరోసా ఉంచి తెలంగాణ ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. నా పనితీరును చూసిన దేశ ప్రజలు మరోసారి మోడీ సేవలు అందుకోవాలని చూస్తున్నారని, తెలంగాణలోనూ బీజేపీకి అధికారం అప్పగిస్తే బావుంటుందన్నారు. సూపర్ ఫాస్ట్ గా ఉండే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని అనుకరించాలలని సూచించారు.

You cannot copy content of this page