MLC Elections: అభ్యర్థి వచ్చినప్పుడే హడావుడి… నేతల ప్రకటనలతోనే సరి…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటీముట్టనట్టుగా బీజేపీ శ్రేణులు…

దిశ దశ, కరీంనగర్:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయ దండు విచిత్రంగా వ్యవహరిస్తోంది. నామినేషన్ల పర్వం మొదలైనా జిల్లాల్లో బీజేపీ ఊపు మాత్రం కనిపించడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించిన బీజేపీ నాయకత్వం వైవిద్యంగా వ్యవహరించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చాటుకునేందుకు పార్టీ పకడ్భందీగానే కార్యాచరణ రూపొందించుకుందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ అభ్యర్థి పేరును ప్రకటించిన తరువాత మాత్రం నామ మాత్రంగానే కార్యకలాపాలు కొనసాగుతుండడం గమనార్హం. పార్టీ శ్రేణులకు, క్యాండెట్ సమీకరణాలకు పొంతన లేకుండానే సాగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. జిల్లా పర్యటన సందర్భంగా హాడావుడి కనిపించినప్పటికీ ఆ తరువాత మాత్రం పార్టీ శ్రేణులు అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. గత నెల 25న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. ఓటర్ల ఇండ్లకు వెల్లి మరీ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్టుగా మాత్రం అనిపించడం లేదు.

సర్వే బృందాలతో…

అయితే బీజేపీ అభ్యర్థి మాత్రం కార్యక్షేత్రంలోకి దిగి ప్రచారం చేయడానికంటే ఎక్కువగా సర్వే బృందాలపై ఆధారపడినట్టుగా అనిపిస్తోంది. సర్వే ఏజెన్సీలు ఇచ్చే నివేదికల ఆధారంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారో లేక సరికొత్త ఎత్తులతో తన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారో అంతు చిక్కడం లేదు కానీ పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రం బీజేపీ శ్రేణులకంటే ఎక్కువగా ఆ పార్టీ అభ్యర్థి నియమించుకున్న సర్వే ఏజెన్సీల హాడావుడే ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రొపెషనల్స్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న సర్వే ఏజెన్సీలు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయోనని తెలుసుకునే పనిలో పడ్డాయి. సాధారణంగా పబ్లిక్ పల్స్ తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తుంటారు. అయితే బీజేపీ తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ప్రచార పర్వానికి నామమత్రంగా ప్రాధాన్యత ఇస్తూ సర్వే టీమ్స్ ద్వారా ఆరా తీయాడానికే పెద్ద పీఠ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలన్న సంకేతాలు రాకపోవడమా లేక… తమను పట్టించుకునే వారు లేరు కాబట్టి తమకెందుకులే అని నిమ్మకుండి పోతున్నారా తెలియదు కానీ సాధారణ బీజేపీ కార్యకర్తలు మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.

సమన్వయం..?

పార్టీ నాయకత్వం అభ్యర్థి పేరును ఖరారు చేసిన తరువాత ఆయా జిల్లాలతో పాటు వివిధ రంగాల్లోని బాధ్యులతో సమన్వయం చేసుకునే విషయంపై బీజేపీ అభ్యర్థి దృష్టి సారించనట్టుగా స్పష్టం అవుతోంది. పదాధికారులు, జిల్లాలు, ఆయా ప్రాంతాల బాధ్యులను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు చేసుకోకపోవడం ఏంటన్నదే ఆ పార్టీ శ్రేణులకు అంతు చిక్కకుండా పోతోంది. దీంతో బీజేపీ అభ్యర్థి అంతరంగం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయిందన్న అభిప్రాయాలు ఆ పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page